Heavy Rains: తెలంగాణలో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని చోట్ల గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
హైదరాబాద్ జలమయం
బుధవారం రాత్రి హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, బేగంపేట, దిల్సుఖ్నగర్, హయత్నగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంకా ఈరోజు కూడా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అవసరమైతే ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఐటీ కంపెనీల ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పించాలని పోలీసులు సూచించారు.
గ్రామాల్లో పరిస్థితి
వర్షాల కారణంగా ఇప్పటికే తెలంగాణలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పంట పొలాలు నీటమునిగాయి. ములుగు జిల్లా వెంకటాపురంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఏకంగా 46.9 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అనేక చోట్ల రహదారులు తెగిపోవడంతో రాకపోకలు అంతరాయమయ్యాయి.
ఇది కూడా చదవండి: Hari Hara Veeramallu Twitter Review: హరి హర వీరమల్లు ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..
ఏపీలో కూడా భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
- మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే జిల్లాలు
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి. - మోస్తరు వర్షాలు పడే జిల్లాలు
కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు. - తేలికపాటి వర్షాలు పడే జిల్లాలు
మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇప్పటికే నమోదైన వర్షపాతం
బుధవారం సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా కంచిలిలో 69మిల్లీమీటర్లు, నర్సన్నపేటలో 62.5మిల్లీమీటర్లు, కోటబొమ్మాళిలో 53.2మిల్లీమీటర్లు, మందసలో 48.7మిల్లీమీటర్లు వర్షం నమోదైంది.

