Harshit Rana: 2003-04లో ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్టు సిరీస్ టీవీల్లో భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున ఆట ఆరంభమయ్యేది. ఆ ఆటను టీవీల్లో చూసేందుకు ఓ ఇంట్లో తనయుడిని ఆ తండ్రి పొద్దున్నే లేపేవాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆ తనయుడే ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్తున్నాడు. అతనే టీమిండియా నయా పేస్ సంచలనం
హర్షిత్ రాణా.
ఉదయాన్నే లేచి టీవీకి అతుక్కుపోయి బోర్డర్ గవాస్కర్ సిరీస్ చూసిన హర్షిత్ రాణా .. ఇప్పుడు టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు వెళుతుండడం నిజంగా గ్రేట్. అతని తండ్రి ప్రదీప్‌కు హర్షిత్‌ను క్రికెటర్‌గా చూడాలన్నది కల. అందుకోసం తండ్రీకొడుకులు బాగా కష్టపడ్డారు. కానీ హర్షిత్ మొదట్లో తీవ్రంగా గాయాల పాలయ్యేవాడు. ఎక్కువగా హర్షిత్‌కు వెన్నెముక, పిక్క, భుజం.. ఇలా వరుసగా గాయాలయ్యేవి. దీంతో అతను ఎక్కువ రోజులు ఆటకు దూరంగా ఉండేవాడు.
ఇది కూడా చదవండి: Virat Kohli: వాంఖెడేలో అదరగొట్టేనా కోహ్లి
Harshit Rana: అతని తండ్రి ప్రదీప్ ఇలా ఎందుకు అవుతుందని హర్షిత్‌ను తీసుకుని ఆయుర్వేదం సహా అన్ని ఆస్పత్రులకు తిరిగాడు. ఓ దశలో హర్షిత్ క్రికెట్ ఆడకున్నా పర్వాలేదని తండ్రి అనుకున్నాడు. కానీ హర్షిత్ మాత్రం వినలేదు. 2020-21 బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో గాయాలున్నా మైదానంలో పోరాడిన పుజారా, హనుమ విహారి, అశ్విన్, నవ్‌దీప్ సైనిని చూసి స్ఫూర్తి పొందిన హర్షిత్.. టెస్టుల్లో టీమ్‌ఇండియాకు ఆడాలనే లక్ష్యం దిశగా సాగాడు. ఇప్పుడు ఆ కలకు అడుగు దూరంలో నిలిచాడు.
6 అడుగులకు పైగా ఎత్తున్న హర్షిత్ గాయాలకు కారణం అధిక బరువు అని తెలుసుకున్నాడు. 2023-24 రంజీ ట్రోఫీకి తొడ కండరాల గాయంతో దూరమవడంతో ఫిట్‌నెస్‌పై హర్షిత్ ప్రధానంగా దృష్టి సారించాడు. 2023 నవంబర్ నుంచి 2024 మార్చి వరకు దాదాపు 17 కిలోల బరువు తగ్గాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో 19 వికెట్లతో కోల్‌కతా టైటిల్ గెలవడంలో హర్షిత్ కీలక పాత్ర పోషించాడు. తాజాగా అసోంతో రంజీ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఢిల్లీ పేసర్ 5 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ 59 పరుగులతో రాణించాడు.
Harshit Rana: ఐపీఎల్ ముగిసినప్పటి నుంచి భారత జట్టుతోనే ఉండడంతో చాలా విషయాలు నేర్చుకున్నానని అందుకే బౌలింగ్ లో రాణిస్తున్నానని అంటున్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికవడం చాలా పెద్ద విషయమని అంటున్నాడు. ఆ జట్టు పోటీతత్వం నాకు సరిగ్గా నప్పుతుందని సహజంగా దూకుడుగా ఉంటే ఈ పేసర్ అభిప్రాయం వ్యక్తం చేసాడు. లార్డ్స్‌లో ఇంగ్లండ్ తో టెస్టు ఆడాలన్నది నా తండ్రి కల. కానీ నాకు ఆస్ట్రేలియాతో ఆడటమే ఇష్టం. ఆసీస్‌లో ఆడే అవకాశం వస్తే ఎలా బౌలింగ్ చేయాలని బుమ్రా, సిరాజ్‌ను అడుగుతూనే ఉన్నా. గంభీర్ అన్న నాకెప్పుడూ మద్దతుగానే ఉన్నాడు. మూడు ఫార్మాట్ల ఆటగాడిగా తనను తాను చూసుకోవాలనుకుంటున్నానని హర్షిత్ చెబుతున్నాడు. గుడ్ లక్ యంగ్ మ్యాన్.