Harish Rao: కాళేశ్వరం నివేదిక.. అసెంబ్లీలో పెట్టొద్దని హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు

Harish Rao: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడగా, ఈ సారి అసెంబ్లీని కుదిపేయబోతున్న హాట్ టాపిక్‌గా కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ నివేదిక నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చకు ముందు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు.

హరీష్‌రావు హైకోర్టు రిజిస్ట్రీలో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసి, అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, ఈ నివేదికను సస్పెండ్ చేయాలని కూడా కోర్టును అభ్యర్థించారు.

గతంలోనే హరీష్‌రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నివేదికపై పిటిషన్లు వేశారు. వాటి ఆధారంగా హైకోర్టు నోటీసులు జారీ చేసి విచారణ వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై అక్టోబర్ 7న హైకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.

అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ హరీష్‌రావు, “కాళేశ్వరం ప్రాజెక్టుపై మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. వాస్తవాలు ప్రజలకు వివరించడానికే ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ గాని, మంత్రి శ్రీధర్ బాబు గానీ ఆ వాస్తవాలు వినడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వకపోవడం వల్లే ఈ ప్రభుత్వానికి భయం ఉన్నట్లు స్పష్టమవుతోంది. నిజాలు తేల్చేది కోర్టులే” అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నివేదికను సభలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తుండగా, బీఆర్ఎస్ నేతలు దీన్ని రాజకీయ ప్రతీకారంగా అభివర్ణిస్తున్నారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ రాజకీయ వేడి మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *