Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల జరిగిన పరిణామాలపై మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌పై పెట్టిన కేసులు, రైతు బంధు, ప్రభుత్వ పనితీరు వంటి వివిధ అంశాలపై స్పందించారు.
రైతు బంధు కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికే కేటీఆర్‌పై కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరపున తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఇతర కేసులపై మాట్లాడుతూ, బ్లాక్ మెయిల్, అక్రమ కేసులతో తమను బలహీనపరచాలని చూస్తున్నారని, కానీ ఇలాంటి కేసులకు భయపడే వాళ్లు కాదని హరీష్ రావు పేర్కొన్నారు. కోర్టు ఎక్కడా తప్పు నిర్ధారించలేదని, విచారణ కొనసాగించవచ్చని మాత్రమే తెలిపిందని అన్నారు.
9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతారని వెల్లడిస్తూ, “మేము తప్పుచేయలేదు, విచారణ నుంచి తప్పించుకోము,” అని అన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఉండడమే తమ ధర్మమని చెప్పారు.
అంతేగాక, కొంతమంది కాంగ్రెస్ నాయకులు కోర్టు చెప్పిన విషయాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రానికి ఈ రేసులో ఆదాయం వచ్చిందని, నష్టం ఏదీ జరగలేదని పేర్కొన్నారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచామని, కానీ అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని హరీష్ రావు తెలిపారు.