Israeli hostages: ఇజ్రాయెల్ – హమాస్ మధ్య సుమారు రెండేళ్లుగా కొనసాగుతున్న ఘర్షణకు తెరదించుతూ, శాంతికి సంబంధించిన ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా, హమాస్ బందీలుగా ఉన్న 20 మంది ఇజ్రాయెల్ పౌరులు సోమవారం విముక్తి పొందారు.
హమాస్ బందీలను రెండు దశల్లో విడుదల చేసింది. మొదట ఏడుగురిని, ఆ తర్వాత మరో 13 మందిని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సంస్థకు అప్పగించింది. ఈ బందీలను ఖాన్ యూనస్ ప్రాంతం నుంచి రెడ్‌క్రాస్ వాహనశ్రేణి ఇజ్రాయెల్‌కు తరలించింది. ‘అల్-అక్సా ఖైదీల మార్పిడి ఒప్పందం’లో భాగంగా మొత్తం 48 మంది ఇజ్రాయెల్ పౌరులను విడిచిపెట్టడానికి హమాస్ గతంలో అంగీకరించింది. అయితే, వీరిలో 20 మంది మాత్రమే సజీవంగా ఉండగా, వారిని తాజాగా విడుదల చేశారు. మిగిలిన 28 మంది మృతదేహాలను కూడా త్వరలో అప్పగించనున్నారు.
Also Read: Trump: ట్రంప్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కారం
ఇందుకు ప్రతిగా, ఇజ్రాయెల్ కూడా తమ చెరలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడానికి అంగీకరించింది. తొలి దశలో 1900 మంది పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ విడిచిపెడుతోంది. ఈ విడుదలైన ఖైదీల జాబితా, హమాస్ విడుదల చేసిన ఇజ్రాయెల్ బందీల జాబితాకు సమానంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
ఈజిప్టులో జరుగుతున్న గాజా శాంతి సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన అధ్యక్షుడు ట్రంప్, ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతోషం వ్యక్తం చేశారు. యుద్ధం ముగియడం, కాల్పుల విరమణ అంగీకారం ఒక గొప్ప రోజుగా అభివర్ణించారు. ఆయుధాలను వీడటానికి కూడా హమాస్ సహకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
2003 అక్టోబర్‌లో హమాస్ దాడి చేసినప్పుడు సుమారు 251 మందిని అపహరించగా, వారిలో కొందరిని గతంలోనే విడుదల చేశారు. తాజాగా 20 మంది విడుదల కావడంతో, రెండేళ్ల భయంకరమైన పరిస్థితుల నుంచి ఈ పౌరులు స్వేచ్ఛా వాతావరణంలోకి అడుగుపెట్టారు.