Gummadi Narsaiah: గుమ్మడి నర్సయ్య అనగానే ఆదర్శం, నిరాడంబరత్వం, హుంగు, ఆర్భాటం లేని ఉన్నతుడు అని గుర్తుకు వస్తాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 25 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన ఇప్పటికీ సాధారణ జీవితాన్నే గడుపుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పైరవీలు, పటాటోపాలకు ఆయన దూరంగా ఉంటారు. ఇప్పటికీ ఆయనలో తన పార్టీ నేర్పిన సిద్ధాంతాలు, తన జీవితం నేర్పిన ఆదర్శనీయ లక్షణాలు తొణికిసలాడుతూ ఉంటాయి.
Gummadi Narsaiah: ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోసం వచ్చిన ఆయనను సీఎం కార్యాలయం లోపలికి సిబ్బంది అనుమతించలేదు. కార్యాలయం ఎదుట రోడ్డుపైనే నిలిచి ఉండి, సీఎం కాన్వాయ్ వెళ్తుండగా, ఆపబోయినా సీఎం కలువకపోవడంతో నిరాశగా వెనుదిరిగిన పోయిన ఘటన వీడియో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆయనకు అవమానమే జరిగిందని రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి సానుభూతి వ్యక్తమైంది. ఆ తర్వాత సీఎం పిలిపించుకొని మాట్లాడారనుకోండి.
Gummadi Narsaiah: ఎక్కడికైనా వెళ్లాలంటే సాధారణ వ్యక్తిలాగే ఆర్టీసీ బస్సునే ఆయన ఆశ్రయిస్తారు. ఊరిలో సైకిల్ పైనే ఆయన వెళ్లి వస్తుంటారు. దోవతి ధరించి రైతుగా కనిపిస్తాడు. తొలినాళ్లలో ఆయన ఎలా ఉన్నారో, 25 ఏళ్ల ఎమ్మెల్యే పదవి అనుభవించిన తర్వాత కూడా ఆయన అలాగే ఉన్నారు. అదే చిత్తశుద్ధితో ఉంటూ వస్తున్నారు. అలాంటి వ్యక్తిని కొనియాడే మరో ఘటన తాజాగా చోటుచేసుకున్నది.
Gummadi Narsaiah: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం గుమ్మడి నర్సయ్య వెళ్లారు. అక్కడ ఇతరుల మాదిరిగానే ఓపీ చీటీ రాయించుకొని, వైద్యుల గది ముందు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. తన వంతు వచ్చాకే ఆయన వైద్యుడి గదిలోకి వెళ్లి కంటి పరీక్ష చేయించుకున్నారు. ఇది ఆయన నిరాడంబరత్వం. ఇదీ ఆయన కట్టుబాటు. ఇదీ ఆయన నేర్చుకున్న ఆదర్శం. ఇదీ ఆయనకు పార్టీ నేర్పిన సలక్షణం. ఇది చాలు ఆయనను మెచ్చుకోకుండా ఉండటానికి. అందుకే శభాష్ గుమ్మడి నర్సయ్య.. మీ జీవనం ఇతరులకు ఎంతో ఆదర్శప్రాయం. నేటి తరానికి స్ఫూర్తిదాయకం.