Gummadi narsaiah: ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ సామాన్యుడిలా జీవనం గడుపుతున్న కమ్యూనిస్టు పార్టీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య తాజాగా మాజీ సీఎం కేసీఆర్ మరియు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్ అన్నీ తానే చేసేవారని, ఒక నియంతలా వ్యవహరించారని విమర్శించారు. ఆయన తన మంత్రులను, ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను కూడా దగ్గరకు రానీయలేదని ఆరోపించారు.
అదే సమయంలో, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రజలతో మమేకం అవుతున్నారని, ఆయన నిజమైన ప్రజల మనిషి అని ప్రశంసించారు. తమ జిల్లాకు సంబంధించిన పలు సమస్యలను రేవంత్ రెడ్డికి వివరించినట్లు గుమ్మడి నరసయ్య చెప్పారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని ఆరోపించిన నరసయ్య, వందల ఎకరాల భూములు ఉన్నవారికీ రైతుబంధు ఇచ్చారని, లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఏళ్లతరబడి ఆలస్యం చేశారని మండిపడ్డారు.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పెద్ద ఎకరాల భూమి ఉన్నవారికి రైతుబంధు నిలిపివేయడం మంచిదని, సంక్షేమ పథకాలు నిజంగా పేదలకే అందడం మంచి పరిణామమని గుమ్మడి నరసయ్య అభిప్రాయపడ్డారు.