Amaravati Farmers: అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, భూయజమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు ఇచ్చిన వారికి చెల్లించాల్సిన వార్షిక కౌలులో పెండింగ్లో ఉన్న మొత్తాన్ని తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. సాంకేతిక సమస్యలు, ఖాతా లింకేజీ సమస్యలు, వారసత్వ హక్కుల వివరాలు అందకపోవడం వంటి కారణాలతో ఇంతకాలం నిలిచిపోయిన చెల్లింపులను ఇప్పుడు సీఆర్డీఏ అధికారులు పరిష్కరించారు.
తాజాగా 495 మంది రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.6,64,80,402ను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్ తెలిపారు. ఇందులో 9వ, 10వ సంవత్సరాలకు గాను 232 మందికి రూ.4,08,41,632ను, 11వ సంవత్సరానికి గాను 263 మందికి రూ.2,56,38,770ను చెల్లించారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: స్థానిక ఎన్నికలపై నేడు సీఎం రేవంత్రెడ్డి అత్యవసర సమావేశం
రైతుల బ్యాంక్ అకౌంట్ లింకేజీ ప్రక్రియలో ఎదురైన సాంకేతిక సమస్యల కారణంగా గతంలో కౌలు నగదు జమ కాలేకపోయింది. కొందరు రైతులు తమ భూములను ప్లాట్లుగా విక్రయించడం, మరికొందరు రైతులు మరణించడంతో వారసుల వివరాలు నమోదు చేయడంలో ఆలస్యం కావడం వల్ల చెల్లింపులు నిలిచిపోయాయి. అయితే, తాజాగా ఈ సమస్యలను సీఆర్డీఏ పూర్తిగా పరిష్కరించి రైతులందరికీ పెండింగ్లో ఉన్న మొత్తాన్ని జమ చేసినట్లు తెలిపింది.
అమరావతి రైతులు తమ భూములను అప్పగించి రాజధాని నిర్మాణానికి సహకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి ఏడాది ప్రభుత్వం వార్షిక కౌలును చెల్లిస్తోంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వివిధ కారణాలతో ఆలస్యం జరిగిన ఈ చెల్లింపులు తాజాగా పూర్తి కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యాంశాలు:
-
అమరావతి ల్యాండ్ పూలింగ్ రైతులకు ప్రభుత్వం వార్షిక కౌలు విడుదల
-
495 మంది రైతులకు రూ.6.64 కోట్లు జమ
-
9వ, 10వ, 11వ సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ మొత్తాల చెల్లింపు
-
సాంకేతిక సమస్యలు, వారసత్వ వివరాల సమస్యలు పరిష్కారం