AP News: ఆంధ్రప్రదేశ్‌లోని మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ, క్వింటా మిర్చికి రూ. 11,781 మద్దతు ధరను ప్రకటించింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, 2.58 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చిని కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం నెలరోజుల పాటు అమల్లో ఉండనుంది.
ఇటీవల, ఆంధ్రప్రదేశ్‌లోని మిర్చి రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర లభించట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి, మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. చంద్రబాబు లేఖకు స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని పరిశీలించి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ద్వారా చర్చలు జరిపిన అనంతరం మద్దతు ధర నిర్ణయించారు.
Also Read: Police Fire: అరెస్ట్ చేసేందుకు వెళితే దాడి చేసిన రౌడీ.. కాల్చి పారేసిన లేడీ ఎస్సై
మిర్చి రైతుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులు, ఎగుమతిదారులతో చర్చించి, మిర్చి ధరల స్థిరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, విదేశాలకు మిర్చి ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో, మిర్చికి గిట్టుబాటు ధర దక్కడానికి మార్గాలు అన్వేషించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం తక్షణమే స్పందించడం మిర్చి రైతులకు ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. మార్కెట్ ధరలు అనుకూలంగా లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్న సమయంలో, కేంద్ర మద్దతు ధర నిర్ణయం వారికి ఆర్థిక భరోసాను అందించనుంది.