Gone Prakash: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోర్ట్ ఆఫ్ వార్డ్స్ చట్టం కింద లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో ఆరు రాజ కుటుంబాలకు చెందిన, ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన ఆస్తులు ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఆస్తులు బ్రిటీష్ కాలం నాటి చట్టం కారణంగా ఇప్పటివరకు తిరిగి ప్రభుత్వ అధీనంలోకి రాలేదని గోనె అన్నారు.
ప్రజల సంక్షేమం కోసం ఈ ఆస్తులను ప్రభుత్వానికి అందించి ఆదాయ వనరులు పెంచాలని తాను కృషి చేస్తున్నానని చెప్పారు. “ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టి మాత్రం ల్యాండ్ క్రూజర్లు, ఇన్నోవా కార్లు, హెలికాప్టర్లపై ఉంది. కానీ నేను మాత్రం ప్రభుత్వానికి డబ్బు వచ్చేలా మార్గం చూపిస్తున్నాను” అని గోనె విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కోసం అపాయింట్మెంట్ కోరినట్లు తెలిపారు. త్వరలోనే అన్ని వివరాలను సీఎంకు సమర్పిస్తానని చెప్పారు. అదేవిధంగా ఏఐసీసీ పెద్దలు మరియు సీనియర్ నేత జానారెడ్డికి కూడా ఈ సమాచారం అందజేస్తానని తెలిపారు. మరో రెండు రోజుల్లో జానారెడ్డిని కలసి ఆస్తులను రక్షించాల్సిన అవసరాన్ని వివరించనున్నట్లు చెప్పారు.
గతంలో జానారెడ్డి ఈ విషయంపై అడ్వొకేట్ జనరల్‌తో కూడా చర్చించారని గోనె గుర్తుచేశారు. కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం ద్వారా కేంద్రం, రాష్ట్రం ఇచ్చిన హామీలను సులభంగా అమలు చేయవచ్చని గోనె అభిప్రాయపడ్డరు.