Kerala: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో బంగారం గల్లంతైన వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సోమవారం డిమాండ్ చేశారు. ఇది క్షమించరాని పాపమని, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం హయాంలో జరిగిన మరో భారీ కుంభకోణమని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని, ఈ కేసును తక్షణమే కేంద్ర ఏజెన్సీకి అప్పగించాలని ఆయన స్పష్టం చేశారు
ఈ వివాదంపై రాజీవ్ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర హోంమంత్రి ఆధీనంలో పనిచేసే కేరళ పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయలేరు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ హోంమంత్రిగా కూడా వ్యవహరిస్తున్నందున, వారి దర్యాప్తులో నిజాలు బయటకు రావు. అందుకే ఈ కుంభకోణంపై కేంద్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలి” అన్నారు.
ఇప్పటికే పినరయి విజయన్ ప్రభుత్వం అనేక కుంభకోణాల్లో కూరుకుపోయిందని, ఆయన కుమార్తె కంపెనీ వ్యవహారాలు, ముఖ్యమంత్రి కార్యదర్శి బంగారం స్మగ్లింగ్ కేసులే ఇందుకు నిదర్శనమని ఆయన విమర్శించారు.
దేవస్వం బోర్డు విఫలమైందన్న విమర్శ
ప్రభుత్వ సంస్థలే పవిత్రమైన శబరిమల ఆలయం నుంచి బంగారాన్ని దోచుకోవడం అత్యంత సిగ్గుచేటని రాజీవ్ చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
“ఆలయ ఆస్తుల పరిరక్షణ బాధ్యత చూడాల్సిన ప్రభుత్వ ఆధ్వర్యంలోని దేవస్వం బోర్డు పూర్తిగా విఫలమైంది. బంగారం తాపడం చేయించే పేరుతో పంపిన దాదాపు నాలుగున్నర కిలోల బంగారం మాయమైంది. అసలు తాపడం చేయించాల్సిన అవసరం లేనప్పుడు బంగారాన్ని బయటకు ఎందుకు పంపారు? ఈ బంగారం తీసుకెళ్లిన వ్యక్తికి కాంగ్రెస్, సీపీఎం పార్టీలతో దగ్గరి సంబంధాలున్నాయి. అతనికి ఈ అధికారం ఎవరిచ్చారు?” అని ఆయన ప్రశ్నించారు.
భక్తుల్లో ఆందోళన – బీజేపీ నిరసనకు సిద్ధం
2009 నుంచి 2013 మధ్య కాలంలో వినియోగించిన బంగారం స్థానంలో ఇప్పుడు ఇత్తడి, రాగిని చేర్చారని మరో కథనం ప్రచారంలో ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ పరిణామాలపై భక్తులే కాకుండా మలయాళీలందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
దేవాలయాల్లో కూడా అవినీతి జరగడాన్ని ఊహించుకోలేకపోతున్నామని అన్నారు. దేవస్వం మంత్రి, దేవస్వం బోర్డు ఛైర్మన్ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు.
ఈ కుంభకోణంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి మంగళవారం ముఖ్యమంత్రి నివాసానికి నిరసన ప్రదర్శన చేపడతామని ప్రకటించారు. ఈ నేరానికి పాల్పడిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించే వరకు బీజేపీ పోరాడుతుందని ఆయన హెచ్చరించారు.
హైకోర్టు ఆదేశాలు
ఇదిలా ఉండగా, శబరిమల బంగారం గల్లంతు వివాదంపై దర్యాప్తు చేసేందుకు ఏడీజీపీ హెచ్. వెంకటేశ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని కేరళ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కూడా సూచించింది.