Prajwal Revanna: హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు పనిమనిషిపై అత్యాచార కేసులో బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో రూ.10 లక్షల జరిమానా కూడా విధించిన న్యాయస్థానం, బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఆగస్టు 1న విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తేల్చారు.
తీర్పు ప్రకటించిన తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ బిగ్గరగా ఏడ్చారు. తనకు తక్కువ శిక్ష వేయాలని న్యాయమూర్తిని వేడుకున్నారు. న్యాయస్థానం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన వెక్కివెక్కి ఏడ్చారు. గత 14 నెలలుగా ప్రజ్వల్ ఈ కేసు విచారణలో భాగంగా జైలులోనే విచారణ ఖైదీగా ఉన్నారు.
కేసు వివరాలు:
కేఆర్ నగరకు చెందిన 47 ఏళ్ల మహిళ 2024 ఏప్రిల్ 28న హొళెనరసీపుర పోలీస్ స్టేషన్‌లో ప్రజ్వల్ రేవణ్ణపై ఫిర్యాదు చేశారు. గన్నిగడ ఫాంహౌస్‌లో తనపై అత్యాచారం జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో అత్యాచారం చేసి, బ్లాక్‌మెయిల్ చేసినట్లు ప్రజ్వల్‌పై ఆరోపణలు నమోదయ్యాయి. అతని ఫామ్‌హౌస్‌లో, నివాసంలో బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేసి, వీడియోలు తీసినట్లు కూడా కేసు నమోదైంది. గత ఏడాది మే 21న పోలీసులు ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేశారు. 2024 ఆగస్టులో ప్రజ్వల్ రేవణ్ణపై చార్జ్‌షీట్ దాఖలైంది.
Also Read: Uttam Kumar: ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరు.. లోకేష్ కు కౌంటర్
2021లో కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో హాసన్‌లోని గన్నికాడ ఫామ్‌హౌజ్‌లో ప్రజ్వల్ తనపై రెండు సార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను కిడ్నాప్ చేసి బెదిరించారని కూడా ఆమె ఆరోపించారు. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముమ్మర దర్యాప్తు జరిపింది. ఫోరెన్సిక్ నివేదికలు లీకైన వీడియోలను ధృవీకరించాయి. గత ఏడాది మే 31న జర్మనీ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రజ్వల్‌ను ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అరెస్టు చేశారు.
ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ కుమారుడు. 2015లో జేడీఎస్‌లో చేరి, 2019 ఎన్నికల్లో హాసన నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ సమయంలో పార్లమెంటులో మూడో అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా గుర్తింపు పొందారు. అయితే, 2023లో అఫిడవిట్‌లో లోపాల కారణంగా కర్నాటక హైకోర్టు ఆయన ఎంపీ పదవిపై అనర్హత వేటు వేసింది.
పనిమనిషిపై అత్యాచారం కేసుతో పాటు ప్రజ్వల్‌పై అశ్లీల వీడియోల కేసులు కూడా నమోదయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ వీడియోలు బయటపడటం సంచలనం సృష్టించింది. హాసన్‌లోని ఫామ్‌హౌజ్ నుంచి 2,900 వీడియోలు ఉన్న పెన్‌డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలకు సంబంధించి ప్రజ్వల్‌పై మూడు కేసులు నమోదయ్యాయి, వీటిని సిఐడి ఆధ్వర్యంలో సిట్ విచారిస్తోంది.

