Period cramps: ఋతుస్రావం (పీరియడ్స్) సమయంలో జీర్ణక్రియ సమస్యలు, కడుపునొప్పి సర్వసాధారణం. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇబ్బందులను సులభంగా అధిగమించవచ్చు. శరీరంలో హార్మోన్ల మార్పుల కారణంగా వచ్చే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ఆహార, జీవనశైలి మార్పులు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.
ఋతుస్రావంలో జీర్ణక్రియ సమస్యలు ఎందుకు వస్తాయి?
ఋతుస్రావ సమయంలో ప్రొజెస్టెరాన్, ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్ల స్థాయిలో మార్పులు వస్తాయి. ఈ హార్మోన్లే జీర్ణక్రియ సమస్యలకు ప్రధాన కారణం.
ప్రోస్టాగ్లాండిన్స్: ఈ హార్మోన్లు ప్రేగుల కండరాలను సంకోచింపజేస్తాయి, దీనివల్ల మలం కదలిక వేగవంతమై డయేరియాకు దారితీయవచ్చు.
ప్రొజెస్టెరాన్: ఈ హార్మోన్ జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తుంది, దీనివల్ల మలబద్ధకం ఏర్పడుతుంది.
ఈ హార్మోన్ల మార్పుల వల్ల బ్లోటింగ్, గ్యాస్, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ఈ సమస్యలు తీవ్రమైనవి కానప్పటికీ, చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
పరిష్కారాలు: ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటివి మానుకోవాలి?
ఈ సమస్యలను నియంత్రించాలంటే కొన్ని సులభమైన జీవనశైలి, ఆహార మార్పులు చేసుకోవడం అవసరం. ఎక్కువగా నీళ్లు తాగడం. ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. శరీరంలో సోడియంను బయటకు పంపడం వల్ల బ్లోటింగ్ కూడా తగ్గుతుంది. ఫైబర్ ఉండే ఆహారాలు ఓట్స్, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటివి డయేరియా, మలబద్ధకం రెండింటినీ సమతుల్యం చేస్తాయి. ప్రోబయోటిక్స్ పెరుగు, పులియబెట్టిన ఆహారాలు (ఫెర్మెంటెడ్ ఫుడ్స్) ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. తేలికపాటి వ్యాయామం వాకింగ్, యోగా లాంటివి బ్లోటింగ్, కడుపునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
ఒకేసారి ఎక్కువ తినకుండా, రోజులో కొన్నిసార్లు కొద్దికొద్దిగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది.
Also Read: Broccoli: బ్రోకలీ: అందరికీ మంచిది కాదట! ఎవరెవరు దీనికి దూరంగా ఉండాలి?
మానుకోవాల్సినవి:
కెఫిన్, షుగర్ డ్రింక్స్: కాఫీ, టీ వంటివి ప్రేగుల కదలికను పెంచి డయేరియాను తీవ్రం చేస్తాయి. షుగర్ డ్రింక్స్ గ్యాస్, బ్లోటింగ్‌కు కారణం అవుతాయి. ఆయిల్, స్పైసీ ఫుడ్స్, కారంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియకు భారం. ఇవి డయేరియా లేదా కడుపు నొప్పిని పెంచవచ్చు. కొంతమందికి పీరియడ్స్ సమయంలో లాక్టోస్ జీర్ణం కాదు. అలాంటి వారు పాలు, పాల ఉత్పత్తులను కొంతకాలం మానుకోవడం మంచిది.
పీరియడ్స్ నొప్పుల నుంచి ఉపశమనం ఇచ్చే ఆహారాలు:
ఋతుస్రావ సమయంలో వచ్చే కడుపునొప్పిని తగ్గించడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు సహాయపడతాయి.
కమలా పండు: ఇందులో ఉండే విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం నొప్పిని తగ్గించే యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి.
దాల్చిన చెక్క: దీనిలో ఉండే యాంటీ-స్పాస్మోడిక్ గుణాలు కండరాల నొప్పులను తగ్గిస్తాయి. దాల్చిన చెక్క టీ తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
డార్క్ చాక్లెట్: దీనిలో ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిచ్చి, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.
అల్లం: ఇది నొప్పికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. అల్లం టీ రుతుస్రావ నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది.
ఆకుకూరలు: పాలకూర వంటి ఆకుకూరల్లో ఉండే ఐరన్, మెగ్నీషియం, కాల్షియం పోషకాలు శరీరానికి శక్తినిచ్చి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
డ్రైఫ్రూట్స్: నల్ల ఎండుద్రాక్షలో ఉండే ఐరన్ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. బాదం, జీడిపప్పు వంటివి కూడా ఈ సమయంలో చాలా ఉపయోగపడతాయి.
ఇలాంటి సాధారణ మార్పులతో, ఋతుస్రావం సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గించుకుని, ఆ రోజులను మరింత సులభంగా గడపవచ్చు. ఏమైనా తీవ్రమైన సమస్యలు ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.
గమనిక: ఈ కథనంలోని అంశాలు నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఇవ్వబడ్డాయి. ఆరోగ్య సమస్యల విషయంలో వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం.