Khammam: రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగడం లేదు. కొమురంభీం జిల్లాలో నిన్న జరిగిన ఘటన మరువకముందే, తాజాగా ఖమ్మం జిల్లాలో మరో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కల్లూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏకంగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
అల్పాహారం తిని అస్వస్థత
ఈ రోజు (మంగళవారం, ఆగస్టు 5, 2025) ఉదయం కల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు అల్పాహారంగా కిచిడీ తిన్నారు. అల్పాహారం తిన్న కొద్దిసేపటికే సుమారు 30 మంది విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు, ఆయాసం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి.
ఆసుపత్రికి తరలింపు.. కొందరి పరిస్థితి విషమం!
విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవడంతో హాస్టల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. బాధితులందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, కొందరు విద్యార్థుల పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం వారిని ఖమ్మం పట్టణంలోని పెద్ద ఆసుపత్రికి తరలించారు అధికారులు.
ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు
గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత విషయంలో పర్యవేక్షణ కొరవడుతోందని, అధికారుల నిర్లక్ష్యం వల్ల అమాయక విద్యార్థులు తరచుగా అస్వస్థతకు గురవుతున్నారని తల్లిదండ్రులు, ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే గురుకులాల్లో చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

