One Nation One Election

One Nation One Election: 2034 తర్వాతే జమిలి ఎన్నికలు..నిర్మలా సీతారామన్‌

One Nation One Election: దేశవ్యాప్తంగా ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ (జమిలి ఎన్నికలు) విధానం అమలు కావడం 2034 తర్వాతే సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ఈ ప్రక్రియకు రాష్ట్రపతి శ్రీకారం చుడతారని, దాంతో 2034లో ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

శనివారం తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో జరిగిన ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జమిలి ఎన్నికలపై ఇప్పటికి అసత్య ప్రచారాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు.

“జమిలి ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం ముందుగా తీసుకోకముందే కొన్ని రాజకీయ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. అసలు ఇది కొత్త ఆలోచన కాదు. గతంలోనూ దీనిపై చర్చలు జరిగాయి. ఈ విధానం ప్రజల ధనాన్ని, సమయాన్ని ఆదా చేస్తుంది,” అని ఆమె స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Sri Rama Navami 2025: మహా గ్రూప్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

2024 లోక్‌సభ ఎన్నికలకు దాదాపు రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చయ్యిందని, ఈ విధానం అమలయ్యే పక్షంలో దేశానికి భారీగా ఖర్చులు తగ్గుతాయని, జీడీపీకి కూడా సానుకూల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.

“పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే, జీడీపీలో 1.5% వరకు వృద్ధి సాధ్యం అవుతుంది,” అని ఆమె వివరించారు.

అంతేకాకుండా, జమిలి ఎన్నికలు ఎవరొకరి వ్యక్తిగత ఆలోచన కాదని, అన్ని పార్టీల ఆమోదం వచ్చిన తర్వాతే కేంద్రం ముందడుగు వేస్తుందని నిర్మలా తెలిపారు.

ఈ సందర్భంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్పై విమర్శలు గుప్పించారు. “డీఎంకే పూర్వ నేత కరుణానిధి గారు జమిలి ఎన్నికలకు మద్దతు ఇచ్చారు. కానీ ఆయన కుమారుడు స్టాలిన్ మాత్రం రాజకీయ అవసరాల కోసం దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రజలు ఈ ద్వంద్వ వైఖరిని గుర్తించాలి” అని ఆమె వ్యాఖ్యానించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *