Musi Floods: శుక్రవారం అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్ నగరం భయానక దృశ్యాలను చూచింది. ఎగువన కురిసిన భారీ వర్షాల ప్రభావంతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ (గండిపేట) జలాశయాలు నిండిపోవడంతో భారీగా గేట్లు ఎత్తివేశారు. దీంతో 35 వేల క్యూసెక్కుల వరదనీరు మూసీ నదిలోకి వదిలారు. ఫలితంగా నగర మధ్యలోని మూసీ మహోగ్రరూపం దాల్చి, పలు ప్రాంతాల్లో ఉధృతంగా ప్రవహించింది.
చాదర్‌ఘాట్ లోలెవల్ వంతెనపై ఆరు అడుగుల వరదనీరు, మూసారాంబాగ్ బ్రిడ్జిపై పది అడుగుల వరదనీరు పొంగిపొర్లాయి. ఎంజీబీఎస్‌కి వెళ్లే రెండు వంతెనలు పూర్తిగా మునిగిపోవడంతో ప్రయాణికులు బస్డాండ్లోనే చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తరలించేందుకు పోలీసులు, జీహెచ్ఎంసీ, విపత్తు నిర్వహణ సిబ్బంది బలంగా యత్నిస్తున్నారు. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి అర్ధరాత్రి సమీక్ష నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు.
పలు కాలనీలు ముంపు – వందల కుటుంబాల తరలింపు
మూసీ పరివాహక ప్రాంతాల్లోని అంబేడ్కర్ బస్తీ, మూసానగర్, శంకర్నగర్తో పాటు పలు కాలనీలు మునిగిపోయాయి. ఇళ్లను ఖాళీ చేయని కుటుంబాలను పోలీసులు బలవంతంగా బయటకు తరలించారు. పలు ప్రాంతాల్లో వంతెనలపై వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో దిల్సుఖ్నగర్, కోఠి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. నార్సింగి వద్ద ఓఆర్ఆర్ సర్వీసు రోడ్లు మూసుకుపోయాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్ త్వరగా కోలుకొని.. ఓజీ విజయాన్ని ఆస్వాదించాలని
పంటలు నష్టపోయిన రైతులు – విమాన రాకపోకలకు అంతరాయం
శంషాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో పంట పొలాలు వరదలో మునిగిపోయాయి. ముఖ్యంగా వరి, కూరగాయలతో పాటు రైతులు వేసిన మిర్చి పంటలు భారీగా నష్టపోయాయి. శంషాబాద్ విమానాశ్రయంలో దిగాల్సిన పలు విమానాలను వాతావరణం అనుకూలం కాకపోవడంతో విజయవాడకు మళ్లించారు. ముంబయి, కోల్‌కతా, పుణె నుంచి వచ్చిన మూడు ఇండిగో విమానాలు ల్యాండ్ అవ్వకుండా తిరిగి వెళ్లిపోయాయి.
రాష్ట్రవ్యాప్తంగా వర్ష బీభత్సం
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. జనగామ జిల్లా జఫర్గడ్లో అత్యధికంగా 10.6 సెం.మీ., నాగార్జునసాగర్‌లో 9.8, సంగారెడ్డి హత్నూర్‌లో 9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వేర్వేరు జిల్లాల్లో జరిగిన ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. ములుగు జిల్లాలో జాతీయ రహదారిపై నీరు చేరడంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ మార్గం పూర్తిగా మూసుకుపోయింది.
వచ్చే 48 గంటలు కీలకం
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శనివారం, ఆదివారాల్లో ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.