Fire Accident: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖకు హృదయంగా ఉండే నిధి భవన్లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం మేరకు రెండో అంతస్తులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.
ఈ ప్రమాదానికి కేంద్ర ఏసీలో షార్ట్ సర్క్యూట్నే కారణమని భావిస్తున్నారు. ప్రమాదం సమయంలో భవనంలో సుమారు 300 మంది పైగా ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే కీలకమైన కంప్యూటర్లు, ఫైళ్లు దగ్ధమయ్యే అవకాశముందని ఉద్యోగులు భావిస్తున్నారు.
ఈ భవనంలో ఖజానా, వర్క్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్, స్టేట్ ఆడిట్, ఏపీసీఎఫ్ఎస్ఎస్, ఎంఏపీజీఎల్ఐ వంటి ముఖ్య విభాగాలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే జీతభత్యాల చెల్లింపులు, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం అందులోనే ఉండటంతో నష్టం తీవ్రంగా ఉండొచ్చని అంటున్నారు.
ఫైల్లు, కంప్యూటర్లపై దెబ్బ పడిన విషయాన్ని పరిశీలించేందుకు ప్రస్తుతం అధికారులే మాత్రమే లోపలికి వెళ్లగలుగుతున్నారు. సాధారణ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులకు అనుమతి లేదు. ఈ నేపథ్యంలో మంత్రి పయ్యావుల కేశవ్ నిధి భవన్కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. “అధికారులు సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది,” అని ఆయన తెలిపారు.
Also Read: Deputy CM Pawan Kalyan: ఫలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి.. నేడు రాష్ట్రానికి కుంకీ ఏనుగులు
Fire Accident: కొంతమంది ఉద్యోగులు ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు తగిన విధంగా అమలు చేయకపోవడమే ఈ ప్రమాదానికి దారితీసిందని ఆరోపిస్తున్నారు. ముఖ్యమైన డేటా మొత్తం ఆన్లైన్లో ఉన్నప్పటికీ, కంప్యూటర్లు కాలిపోవడం వల్ల కొంత సమాచారాన్ని కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

