US Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న వివాదాస్పద సుంకాల (Tariffs) నిర్ణయాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వాణిజ్య భాగస్వామి దేశాలపై ఎడాపెడా విధించిన టారిఫ్‌లు రాజ్యాంగ విరుద్ధమని, అధ్యక్షుడికి అలాంటి విస్తృత అధికారం లేదని యూఎస్ ఫెడరల్ అప్పీల్ల కోర్టు స్పష్టంచేసింది. ట్రంప్ విధించిన పలు కీలక సుంకాలు చట్టబద్ధంగా అమలు కావని పేర్కొంది.
ఫెడరల్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఈ కేసులో 7-4 మెజారిటీతో తీర్పునిచ్చింది. రాజ్యాంగం ప్రకారం సుంకాలు విధించే అధికారం కాంగ్రెస్‌కే ఉందని, అధ్యక్షుడు ఆ అధికారాన్ని స్వయంగా వినియోగించుకోవడం చట్టవిరుద్ధమని న్యాయమూర్తులు తీర్పులో పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక అత్యవసర అధికారాల చట్టం (IEEPA) కింద ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఆ చట్ట పరిధిని మించి ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.
వాణిజ్యంపై ప్రభావం
‘అమెరికా ఫస్ట్’ (America First) సిద్ధాంతంతో ట్రంప్ గత రెండేళ్లుగా పలు దేశాలపై సుంకాలను పెంచారు. భారత్‌పై కూడా రష్యా నుంచి చమురు దిగుమతుల పేరుతో 25% పైగా ప్రతిస్పందన సుంకాలు విధించడం సర్వత్రా విమర్శలకు గురైంది. ఈ సుంకాల కారణంగా అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
కోర్టు తీర్పు సుప్రీంకోర్టులో కూడా నిలిస్తే, భారత్‌పై ఉన్న 25% సుంకం సహా పలు కీలక టారిఫ్‌లు రద్దయ్యే అవకాశం ఉంది. అయితే, జాతీయ భద్రతా కారణాలతో స్టీల్, అల్యూమినియం వంటి ఉత్పత్తులపై విధించిన సుంకాలకు ఈ తీర్పు వర్తించదని స్పష్టం చేశారు.
ట్రంప్ ఆగ్రహం – సుప్రీంకోర్టు ఆశ
కోర్టు తీర్పుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఈ తీర్పు కొనసాగితే అమెరికా ఆర్థికంగా బలహీనమవుతుంది. టారిఫ్‌లు మా దేశ ప్రయోజనాలను కాపాడటానికి అత్యుత్తమ మార్గం” అని తన ట్రూత్ సోషల్ (Truth Social) ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
వైట్‌హౌస్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ, సుప్రీంకోర్టులో తమకు విజయం లభిస్తుందని తెలిపింది. కోర్టు అక్టోబర్ 14 వరకు ఈ తీర్పు అమలును నిలిపివేసింది. అప్పటివరకు ప్రస్తుతం అమల్లో ఉన్న సుంకాలు కొనసాగుతాయి.

