Mahabubabad: రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఒక్క యూరియా బస్తా కోసం రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో, పలు చోట్ల ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు తమ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.
ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
శుక్రవారం మహబూబాబాద్ పట్టణ కేంద్రానికి రెడ్డియాల, కంబాలపల్లి గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం వచ్చారు. కానీ అధికారులు యూరియా నిల్వలు లేవని చెప్పడంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వారు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.
‘యూరియా ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదు’ అంటూ నినాదాలు చేశారు. ఒక దశలో పోలీసులు క్యాంపు కార్యాలయ గేట్లు మూసివేయగా, రైతులు వాటిని తోసుకుంటూ లోపలికి వెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్యే మురళి నాయక్ వెంటనే వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి రైతులకు యూరియా పంపిణీ చేయాల్సిందిగా సూచించారు. అనంతరం పోలీసులు రైతులను బుజ్జగించి అక్కడి నుంచి పంపించారు. యూరియా కొరత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.


