Heavy Rains: తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు (శుక్రవారం) పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే సూచనల నేపథ్యంలో, రాష్ట్రంలోని 15 జిల్లాలకు ‘ఆరెంజ్’ హెచ్చరిక జారీ చేయబడింది. ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హెచ్చరిక జారీ అయిన జిల్లాలు
నిర్మల్
నిజామాబాద్
జగిత్యాల
రాజన్న సిరిసిల్ల
భూపాలపల్లి
ములుగు
మహబూబాబాద్
వరంగల్
వికారాబాద్
సంగారెడ్డి
మెదక్
కామారెడ్డి
మహబూబ్‌నగర్
నాగర్‌కర్నూల్
వనపర్తి
హైదరాబాద్‌లో వర్షం ఉధృతి
నగరంలో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, కిస్మత్పూర్, గండిపేట, అత్తాపూర్, ఆరాంఘర్, శంషాబాద్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి వంటి ప్రాంతాలు వర్షానికి తడిసిపోతున్నాయి. అలాగే, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గుండ్లపోచంపల్లి, బహదూర్‌పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, షాపూర్‌నగర్, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బాలానగర్, శంకర్పల్లి, మోకిల ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. రోడ్లపై వరద నీరు పారుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్లు పరిస్థితిని నిరంతరం సమీక్షించాలి. చెరువుల కట్టలను పరిశీలించి, వరద నీరు రోడ్లపై చేరకుండా చర్యలు తీసుకోవాలి. వాహనాల రాకపోకలను ముందస్తుగా నియంత్రించాలి. విద్యుత్ శాఖ అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా చేయాలి అని సీఎం ఆదేశించారు.
ప్రజలకు సూచనలు..
లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం వల్ల రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాల్లో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.