Chevella Accident: రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ దుర్ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈ బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఇందులో పది మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది,” అని వెల్లడించారు.
Also Read: Chevella Bus Accident: చేవెళ్ల ప్రమాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా (పరిహారం) ప్రకటించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ధృవీకరించారు. అలాగే, ప్రమాదంలో గాయపడ్డ వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. గాయపడిన వారందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.
మరణించిన 19 మందిలో 13 మృతదేహాలను పోలీసులు ఇప్పటికే గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు మంత్రి తెలిపారు. మృతదేహాల పోస్టుమార్టం ప్రక్రియ మొత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ క్లిష్ట సమయంలో రాజకీయాలు మాట్లాడటం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సహాయక చర్యలపై, బాధితులకు అండగా నిలబడటంపై మాత్రమే దృష్టి పెట్టిందని ఆయన పేర్కొన్నారు.

