Maharashtra CM: మహారాష్ట్ర తదుపరి సీఎం బీజేపీ నుంచే వచ్చే అవకాశం ఉంది. బుధవారం తాత్కాలిక సీఎం ఏక్‌నాథ్ షిండే థానేలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ సీఎంను అంగీకరిస్తున్నామని చెప్పారు. తనకు పదవిపై కోరిక లేదని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ తన వెంట నిలిచారనీ.. ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తాననీ షిండే వెల్లడించారు.
ప్రధాని మోడీతో ఫోన్ లో మాట్లాడినట్టు షిండే చెప్పారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మీ మనసులో ఎలాంటి ఆటంకాలు సృష్టించుకోవద్దు అంటూ మీడియాకు చెప్పారు. అలాగే మేమంతా ఎన్డీయేలో భాగమే. బీజేపీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తాం. స్పీడ్ బ్రేకర్ లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు మేం అడ్డంకి కాబోం అని తమ నిర్ణయాన్ని విస్పష్టంగా ప్రకటించారు.
ఇది కూడా చదవండి: KTR: కేసీఆర్ వ్యూహం.. పూర్వ వైభవంపై బీఆర్ఎస్ ఫోకస్
Maharashtra CM: నేనెప్పుడూ నన్ను ముఖ్యమంత్రిగా భావించుకోను. నేనెప్పుడూ సామాన్యుడిలా పనిచేశాను. ఇది ప్రజల విజయం. మద్దతు తెలిపిన ప్రజలకు ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో ఉదయం 5 గంటల వరకు పని చేసేవారు. కార్యకర్తలు అందరూ చాలా కష్టపడి పనిచేశారు అంటూ షిండే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మహారాష్ట్రలో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగిపోయినట్టు తేల్చేశారు.
షిండే ప్రకటన అందరి సందేహాలను దూరం చేసిందని మాజీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మహాయుతిలో ఎప్పుడూ విభేదాలు లేవు. ముఖ్యమంత్రి పేరుపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం అని ఆయన చెప్పారు.
ఇక నవంబర్ 28న ఢిల్లీలో మహాయుతికి చెందిన మూడు పార్టీల నేతల సమావేశం జరగనుంది. రేపు ఫడ్నవీస్ పేరును సీఎం ఆమోదించే అవకాశం ఉంది. కేంద్రానికి వెళ్లే ప్రశ్నపై, షిండే మాట్లాడుతూ- తాను మహాయుతి ప్రభుత్వంతో ఉన్నాననీ.. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాననీ వెల్లడించారు.