KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎదురు లేదు అనుకున్న కారు పార్టీకి గట్టి షాక్ తగిలింది. కేసీఆర్‌కు దీటుగా సమాధానం ఇస్తూ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్లారు. దీంతో హస్తానికి ప్రజలు జై కొట్టారు. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కారు పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, ఆ తరువాత కూడా కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు.
సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయిన గులాబీ పార్టీలో జోష్ నింపేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజలకు అండగా ఉండేందుకు పోరాడుతున్నారు. అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష పేరుతో పదిమంది ఎమ్మెల్యేలను, 8 మంది ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకున్న… ఎక్కడా తగ్గకుండా పార్టీ నేతలు చేదిరిపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాట పంథా ఎంచుకున్నారు. హైడ్రా కూల్చివేతలు, మూసి బాధితులకు అండగా ఉంటూ… మేమున్నామంటూ ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Siddipet: సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం ఎవరిదో…!
KTR: ప్రజలకు ఏ సమస్య వచ్చినా జనతా గ్యారేజ్ తరహాలో తెలంగాణ భవన్‌కు వస్తున్న పరిస్థితులను కల్పించారు. బాధితుల సమస్యలను పరిష్కరిస్తూ వారికి అవసరమైన లీగల్ సర్వీసులను ఉచితంగా పార్టీ తరఫున అందిస్తున్నారు. తాజాగా కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా రాజకీయంగా రీ ఎంట్రీ ఇవ్వడంతో బీఆర్‌ఎస్ క్యాడర్‌లో జోష్ కనపడుతుంది.
లగచర్ల ఘటన వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎండగడుతూ గిరిజన రైతులకు మేమున్నామనే భరోసా కల్పించారు. బీఆర్ఎస్ నేతల కుట్రతోనే అధికారులపై దాడి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నా… ఎక్కడ వెనకడుగు వేయకుండా గిరిజన రైతులతో
KTR: కలిసి ఢిల్లీ కేంద్రంగా రేవంత్ సర్కార్‌పై ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్‌లో గిరిజన దీక్ష చేపట్టి తమకు దూరమైన గిరిజనులను దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జిహెచ్ఎంసి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ క్యాడర్‌ను గాడిన పెట్టేందుకు పార్టీ రెడీ అవుతోంది. ఈ నెల 29న దీక్షా దివస్‌తో మళ్లీ డోస్ పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన నవంబర్ 29న నుంచి జిల్లా పార్టీ ఆఫీసులో పార్టీ కార్యక్రమాల నిర్వహణ మొదలు పెట్టేలా కార్యాచరణ సిద్ధం చేసింది. దీక్షా దివస్‌కు ముందుగానే సమావేశాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు పావులు కదుపుతోంది బీఆర్ఎస్… ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీపై ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడుతోంది.