Eggs: గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో గుడ్ల గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా గుడ్లు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని, వాటిలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని వస్తున్న పోస్టులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (FSSAI) రంగంలోకి దిగింది. గుడ్ల గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, అవన్నీ తప్పుడు వార్తలని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
దేశంలో విక్రయిస్తున్న గుడ్లు పూర్తిగా సురక్షితమైనవని ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) హామీ ఇచ్చింది. గుడ్లలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అధికారులు వెల్లడించారు. మన దేశంలో తయారయ్యే గుడ్లు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయం లేకుండా వాటిని ఆహారంగా తీసుకోవచ్చని వారు పేర్కొన్నారు.
ముఖ్యంగా గుడ్లలో ‘నైట్రోఫ్యూరాన్’ అనే రసాయనాలు ఉన్నట్లు వస్తున్న వార్తలపై అధికారులు స్పందించారు. మన దేశ చట్టాల ప్రకారం.. పౌల్ట్రీ ఫారాల్లో లేదా గుడ్ల ఉత్పత్తిలో ఈ రసాయనాలను వాడటం 2011 నుంచే పూర్తిగా నిషేధించబడింది. నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని, ఎక్కడా ఇలాంటి ప్రమాదకర పదార్థాలు వాడటం లేదని అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి పోషకాహారమైన గుడ్డును దూరం చేసుకోవద్దని వారు సూచించారు.

