Supreme Court: కండ్లకు గంతలు.. ఒక చేతిలో త్రాసు.. మరో చేతిలో ఖడ్గం.. విదేశీ వస్త్రాలు ధరించిన స్త్రీ మూర్తి రూపాన్ని మనం ఇప్పటిదాకా చూశాం. కోర్టులు, లీగల్ చాంబర్లు, సినిమా సీన్లలో మనం చూసిన ఆ న్యాయదేవత రూపం ఇక మారనున్నది. ఈ మేరకు రూపొందించిన కొత్త విగ్రహాన్ని సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల లైబ్రరీలో తొలుత ఏర్పాటుచేశారు. ఇప్పటిదాకా మనం చూసిన ఆ న్యాయదేవత రూపంపై సినిమాలు కూడా వచ్చాయి. చట్టానికి కళ్లు లేవు లాంటి సినిమాలు, సీన్లు, డైలాగులు మనం ఎన్నో చూశాం.
Supreme Court: చట్టం ఇకపై గుడ్డిది కాదు.. అన్న సందేశంతోనే ఆ రూపును మార్పు చేసినట్టు న్యాయాధికారులు చెప్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ చొరవతో కొత్త న్యాయదేవత రూపుదిద్దుకున్నదని చెప్తున్నారు. బ్రిటీష్ చట్టాలకు వీడ్కోలు పలికి కొత్త చట్టాలు అమల్లోకి తెచ్చిన సందర్భంలో న్యాయదేవత రూపు కూడా మారాలనే చంద్రచూడ్ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు.
Supreme Court: ఇక కొత్త న్యాయదేవత రూపు అచ్చం మన భారతీయ స్త్రీమూర్తిత్వం ఆవిష్కరించినట్టుగా ఉన్నది. కండ్లకున్న గంతలను సుప్రీంకోర్టు తొలగించింది. న్యాయదేవత ఒక చేతిలో ఉండే త్రాసును అలాగే ఉంచి, మరో చేతిలో ఉండే ఖడ్గం స్థానంలో రాజ్యాంగ ప్రతిని ఉంచింది. బ్రిటీష్ కాలం నాటి దుస్తుల స్థానంలో చీరకట్టుతో విగ్రహాన్ని రూపొందించారు. భారతీయ న్యాయవ్యవస్థ చిహ్నానికి కొత్త రూపును తీసుకురావడమే లక్ష్యంగా ఈ కీలక మార్పలు చేశారు. దీంతో చట్టాల మాదిరిగానే బ్రిటీష్ కాలం నాటి పేర్లు, గుర్తులు సవరించాలనే కోణం కూడా ఉన్నది.
Supreme Court: ఈ నెలలోనే సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల గ్రంథాలయంలో ఈ నూతన న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. న్యాయదేవత కండ్లకు గంతలు అవసరం లేదు. చట్టం ఎప్పుడూ గుడ్డిది కాదని, చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, ఖడ్గం హింసకు ప్రతీకగా కనిపిస్తున్నది.. అందువల్ల వాటిని తొలగించి కొత్తరూపం తీసుకురావాలన్న జస్టిస్ వైవీ చంద్రచూడ్ ఆదేశాలతోనే న్యాయదేవతకు పాత రూపం తొలగి కొత్తరూపంతో ఆవిష్కృతమైంది.