Director Vamsy: తెలుగు చిత్రసీమలో ఒక కె. విశ్వనాథ్… ఒక బాపు… ఒక వంశీ! ప్రతి ఫ్రేమ్ లోనూ తమదైన ముద్రను వేయడానికి ఆరాటపడే దర్శకులు ఈ ముగ్గురూ! వీరిని మించిన కమర్షియల్ డైరెక్టర్స్ ఉండొచ్చు…. కానీ వీరిలా ప్రతి ఫ్రేమ్ లో తమదైన ముద్రను కనబరిచే వారు అరుదు. కళాతపస్వి కె. విశ్వనాథ్, బాపు ఇవాళ మన మధ్య లేదు… దర్శకుడు వంశీ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. వెన్నెల్లో గోదావరి అలల్లా ఆయన సినిమాల్లో కామెడీ పరవళ్లు తొక్కుతుంది. గోదారమ్మ తీరంలోని సందడి ఆయన కథల్లో కదం తొక్కుతుంది.. అరకు అందాలు ఆయన కట్ షాట్ ల మధ్య సరికొత్తగా ఆవిష్కృతమవుతాయి.. కొండల నడుమ లోయలోని అందాలు ఆయన నాయకీమణుల నాట్యాల వయ్యారాల్లో ఒదిగి పోతాయి . కామెడీ.. సస్పెన్స్.. ట్రాజెడీ.. ఫిక్షన్.. రొమాన్స్.. ఇలా ఏ రసమైనా సరే ఆయన కలం నుంచి జాలువారే అక్షరాల్లో కొత్త సొగసులు అడ్డుకోవాల్సిందే. ఇలా చెప్పుకుంటూ పోతే మనం డైరెక్టర్ గా చెప్పుకునే వంశీ గురించి పదాక్షరాలు తేవడం చాలా కష్టం . ఈరోజు అంటే , నవంబర్ 20 వంశీ పుట్టిన రోజు(Director Vamsy Birthday) సందర్భంగా ఆయన సినీ ప్రయాణంపై ఓ లుక్కేద్దాం . .
Director Vamsy: తెలుగు సినిమా రంగంలో దర్శకుడు వంశీది ఓ ప్రత్యేక శైలి. నాలుగు దశాబ్దాల కాలంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు కేవలం 26. బేసికల్ గా మంచి రచయిత అయిన వంశీ… మొదటి సినిమా రీమేక్ అంటే ఆశ్చర్యం కలుగుతుంది. అయిష్టంగా ఆయన డైరెక్ట్ చేసినా… డెబ్యూ మూవీ ‘మంచుపల్లకి’తోనే తనదైన ముద్రను వేశారు వంశీ.
దర్శకుడు వంశీ అసలు పేరు నల్లమిల్లి భామిరెడ్డి. 1956 నవంబర్ 20న గోదావరి జిల్లాలోని రామచంద్రపురంలో పుట్టిన వంశీకి యుక్తవయసులోనే కథలు రాయడం అలవాటైంది. ఆయన రాసిన తొలి కథ ‘సత్య సుందరి నవ్వింది’ 1976లో విజయవాడ ఆలిండియా రేడియో యువవాణిలో ప్రసారమైంది. దాంతో వరుసగా కథలు రాయడం మొదలెట్టారు వంశీ. ఆయన తొలి కథ ఆంధ్రజ్యోతి వార పత్రికలో అచ్చయ్యింది. తండ్రి మరణంతో జీవిక కోసం తన కిష్టమైన చిత్రకారుడు, దర్శకుడు బాపును వెతుక్కుంటూ చెన్నయ్ వెళ్ళారు వంశీ. అయితే… బాపు కంటే ఆయన ప్రముఖ దర్శకుడు వి. మధుసూదనరావును కలవడం జరిగింది. ఆయన చెప్పిన అస్సైన్ మెంట్ ను వంశీ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయడంతో తాను డైరెక్ట్ చేస్తున్న ‘ఎదురీత’ సినిమాకు వంశీని అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు వి. మధుసూదనరావు. ఎన్టీఆర్ పై తొలి క్లాప్ కొట్టిన విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనంటారు వంశీ.
Director Vamsy: ఎన్టీఆర్ ‘ఎదురీత’ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘విచిత్రజీవితం’ చిత్రానికి వంశీ వర్క్ చేశారు. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు(Edida Nageswararao) గారి పూర్ణోదయ బ్యానర్ లో వంశీ దర్శకత్వ శాఖలో చేశారు. అలానే కె. విశ్వనాథ్ తెరకెక్కించిన ‘శంకరాభరణం’తో పాటు ప్రముఖ దర్శకులు కె. భారతీరాజా రూపొందించిన ‘సీతాకోక చిలుక’ చిత్రానికి వర్క్ చేశారు. ఆ సినిమాకు వర్క్ చేస్తుండగానే ఓ తమిళ సినిమా రీమేక్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వంశీని వెతుక్కుంటూ వచ్చింది. ముప్పై ఏళ్ళు వచ్చే వరకూ డైరెక్షన్ చేయకూడదని వంశీ అనుకున్నా… తనకు గురువులాంటి వేమూరి సత్యం చెప్పడంతో ‘పాలైవనసోలై’ మూవీని తెలుగులో ‘మంచుపల్లకి'(Chiranjeevi Manchupallaki)గా తెరకెక్చించారు. చిరంజీవి, నారాయణరావు, సాయిచంద్, రాజేందప్రస్రాద్, గిరీశ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు. తమిళంలో నాయికగా నటించిన సుహాసిని తెలుగులోనూ యాక్ట్ చేసింది. వంశీ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా… అందులోని హ్యాపీ న్యూ ఇయర్ సాంగ్ ఇప్పటికే కొత్త సంవత్సర వేడుకల్లో వినిపిస్తూనే ఉంటుంది.
తొలి చిత్రం దర్శకుడిగా పేరు తెచ్చిపెట్టినా.. అది రీమేక్ కావడం, కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడం వంశీని కాస్తంత కుంగదీసింది. ఆ టైమ్ లో వంశీకి దన్నుగా నిలిచిన వ్యక్తి ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. తమ చిత్రాలకు వర్క్ చేసిన వంశీ ప్రతిభపై నమ్మకం ఉన్న ఆయన ఓ అవకాశం ఇచ్చి చూడాలనుకున్నారు. అలా తెరకెక్కిందే ‘సితార’ సినిమా. సుమన్ హీరోగా నటించిన ఈ సినిమాలో భానుప్రియ(Bhanu Priya) నాయిక. తాను గతంలో రాసిన ‘మహల్లో కోకిల’ నవలనే ‘సితార'(Sitara Movie)గా తెరకెక్కించారు వంశీ. నిర్మాత సహకారం పుష్కలంగా ఉండటంతో తాను అనుకున్న విధంగా ‘సితార’ను ఆయన రూపొందించగలిగారు. ఫలితంగా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డును అందుకుంది ‘సితార’ మూవీ. అంతేకాదు… బెస్ట్ ఎడిటర్ గా అనిల్ మన్నాడ్ కు, ఉత్తమ నేపథ్య గాయనిగా జానకి (Singer S.Janaki)కి జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది ‘సితార’.
Director Vamsy: తొలి చిత్రం ‘మంచుపల్లకి’తోనూ దర్శకుడిగా తనదైన ముద్రను వేసిన.. వంశీ ప్రతిభ ఏమిటనేది నిరూపించింది మలి చిత్రం ‘సితార’. కమర్షియల్ సక్సెస్ తో పాటు జాతీయ స్థాయిలో అవార్డులనూ అందుకోవడంతో వంశీతో సినిమా నిర్మించడానికి పలువురు నిర్మాతలు పోటీ పడ్డారు. అయితే… భారతీరాజా శిష్యుడైన వంశీ మాత్రం తన ప్రతి చిత్రం కొత్తదనంతో ఉండాలని కోరుకున్నారు. అందుకే ‘మంచు పల్లకీ, సితార’కు భిన్నంగా మూడో చిత్రం ‘అన్వేషణ'(Anveshana Movie)ను తెరకెక్చించారు. హాలీవుడ్ చిత్రాల స్థాయిలో… సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ‘అన్వేషణ’ చిత్రం వంశీకి మరింత పేరు తెచ్చిపెట్టింది. ఇళయరాజా స్వరాలు, వంశీ టేకింగ్ ఒకదానితో ఒకటి పోటీ పడి… ఈ సినిమాకు ఘన విజయాన్ని కట్టపెట్టాయి.
‘అన్వేషణ’ చిత్రం సెట్స్ మీద ఉండగానే ఉషాకిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు… వంశీ డైరెక్షన్ లో సినిమా నిర్మించాలని అనుకున్నారు. ‘వసుంధర’ రాసిన నవలను బేస్ గా తీసుకుని వంశీ తెరకెక్కించిన ‘ప్రేమించు పెళ్ళాడు’ (Preminchu Pelladu)మూవీలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించారు. గతంలో కొన్ని చిత్రాలలో కీలక పాత్రలు పోషించినా… రాజేంద్ర ప్రసాద్ సోలో హీరోగా నటించడం ఇదే మొదటిసారి. రామోజీరావును ఒప్పించి మరి ఈ చిత్రానికి ఇళయరాజా(ilayaraja)తో సంగీతాన్ని ఇప్పించుకున్నారు వంశీ. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇళయరాజా ఎప్పటిలానే నిలబెట్టుకున్నారు. వంశీ మీద అభిమానంతో ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని సమకుర్చారు. అందువల్లే ఇప్పటికీ అందులోని పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదే ఊపుతో వంశీ చేసిన నాలుగో సినిమా ‘ఆలాపన’ మేకింగ్ పరంగా ఆయనకు పేరు తెచ్చిపెట్టినా… మ్యూజికల్ గా హిట్ అయినా.. కమర్షియల్ గా మాత్రం కాసుల వర్షం కురిపించలేదు.
Director Vamsy: నటులకు ఓ పాత్ర గుర్తింపు తెచ్చిపెడితే… ఆ తర్వాత అవే తరహా పాత్రలు వస్తుంటాయి. అలానే దర్శకుడికి ఒక జానర్ మూవీ హిట్ అయితే… ఆ తర్వాత అలాంటి సినిమాలే చేయాల్సి వస్తుంది. అలా వంశీ ట్రాక్ ను పూర్తిగా మార్చేసిన సినిమా ‘లేడీస్ టైలర్’. మంచికో చెడుకో చెప్పలేం కానీ వంశీ కెరీర్ ను మలుపు తిప్పేసిన సూపర్ హిట్ మూవీ ఇది.
మోకాలిపైన పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కలిసి వస్తుందనే పిచ్చి నమ్మకం ఉన్న లేడీస్ టైలర్ కథ ఇది. ‘సితార’, ‘అన్వేషణ’, ‘ప్రేమించు పెళ్ళాడు’ వంటి సినిమాలు తీసిన వంశీ ఇలాంటి కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని ఎవరూ అనుకోరు. పుట్టుమచ్చ వెతకడానికి హీరో పడే పాట్లు… ముగ్గురు అమ్మాయిల చుట్టూ చక్కర్లు కొట్టే వైనం… జీవిత పాఠాలు నేర్పే ఓ పంతులమ్మా… పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ‘లేడీస్ టైలర్’ (Ladies Tailor Movie)ఓ రకంగా చెప్పాలంటే సెమీ అడల్డ్ కంటెంట్ మూవీ. కానీ తనికెళ్ళ భరణి చమత్కారపు మాటలతోనూ, సీతారామశాస్త్రి తన సాహిత్యంతోనూ, ఇళయరాజా తనదైన బాణీలతోనూ ఈ చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెట్టారు. క్యారెక్టరైజేషన్స్ విషయంలో వంశీ చేసి హోమ్ వర్క్ అద్భుతంగా వర్కౌట్ కావడంతో ‘లేడీస్ ట్రైలర్’ అన్ని వర్గాల ఆదరణను అందుకుంది.
దర్శకుడు బాపు అన్నా… రచయిత ముళ్ళపూడి అన్నా వంశీకి ప్రాణం. బాపు, రమణల చిత్రాలకు ఆయన పనిచేయకపోయినా… బాపు టేకింగ్, రమణ రైటింగ్ అంటే ప్రాణం పెట్టేస్తారు. అందుకే ముళ్ళపూడి వెంకట రమణ కథ, కథనం అందించిన ‘లాయర్ సుహాసిని’ మూవీని వంశీ తెరకెక్కించారు. కానీ సినిమా కమర్షియల్ గా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టలేదు. ఈ సినిమాలోనే స్టిల్ ఫోటోగ్రాఫర్ గా ఓ ఫ్రేమ్ లో చటుక్కున కనిపించి మాయమౌతారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. ఈ చిత్రానికి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(SP Balasubrahmanyam Music) సంగీతం అందించడం విశేషం.
స్టార్స్ తో సంబంధం లేకుండా… కథ, కథనాలే స్టార్స్ గా భావిస్తారు వంశీ. కథపై బాగా కసరత్తు చేయడమే కాదు… టేకింగ్ కోసం కూడా విశేషంగా శ్రమపడుతుంటారు. ఇళయరాజా ఇచ్చిందే ప్రసాదంగా భావించే ఆ సమయంలోనూ వంశీ… తన చిత్రాలకు ఇళయరాజాతో చేయించుకున్న స్వరాలు చాలా గొప్పగా ఉండేవి. ఇక ఆర్టిస్టుల విషయంలో వంశీ ఎలాంటి రాజీ పడరు. తాను కోరుకున్న నటీనటులు ఒక్కోసారి లభించకపోయినా… నిర్మాత ఇచ్చిన నటీనటులతోనే తనకు కావాల్సిన ఎక్స్ ప్రెషన్స్ ను తెప్పించుకునే వారు. వంశీ సినిమా అంటే ఇది అనిపించుకున్న చిత్రం ‘మహర్షి’. నూతన నటుడు రాఘవ, కృష్ణభగవాన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాతోనే భానుప్రియ సోదరి నిశాంతి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలోని పాటలు వంశీ – ఇళయరాజా కాంబోను మరో స్థాయికి తీసుకెళ్ళిపోయాయి. జొన్నవిత్తులతో సంస్కృతంలో పాట రాయించి సరికొత్త ప్రయోగానికి నాంది పలికారు వంశీ.
దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘ముత్యాలముగ్గు’ సినిమాలో ప్రముఖ కవి శేషేంద్ర శర్మ ‘ నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ గీతాన్ని రాశారు. బయట గొప్ప కవిగా పేరున్న శేషేంద్ర సినిమాకు రాసింది ఆ ఒక్క పాటే. అలానే వంశీ ‘మహర్షి’ కోసం ప్రముఖ రచయిత, ప్రచురణ కర్త నాయని కృష్ణమూర్తి ‘సుమం ప్రతి సుమం… సుమం’ గీతాన్ని రాశారు. ఆ తర్వాత ఆయన మరే పాట సినిమాలకు రాయలేదు.
ఇది వంశీ సినిమా అని ఎవరైనా ఠక్కున చెప్పగలగడానికి ప్రధాన కారణం ఆయన చిత్రాలలోని క్యారెక్టరైజేషన్ అండ్ టేకింగ్. దానికి పరాకాష్ట అని చెప్పుకోవాల్సిన సినిమా ‘శ్రీ కనకమాలక్ష్మీ రికార్డింగ్ టాన్స్ ట్రూప్'(Sri Kanakamahalakshmi Dancing Troup). ఈ సినిమా పేరు దగ్గర నుండి మేకింగ్ అంతా ఓ అద్భుతం అనే చెప్పాలి. నరేశ్, మాధురీ జంటగా నటించిన ఈ సినిమాలో ప్రతి ఒక్క నటీ, నటుడు కూడా చక్కని నటన కనబరిచారు. మరీ ముఖ్యంగా ఆర్టిస్టుల డైలాగ్ మాడ్యులేషన్ అమోఘం. బాధాకరం ఏమంటే… వంశీ ఎంతో కష్టపడి, ఇష్టపడి తీసిన ఇలాంటి సినిమాలు ఆయన అభిమానులను ఆలరించాయి తప్పితే… కమర్షియల్ గా పెద్దంత విజయాలను మాత్రం అందుకోలేదు.
Director Vamsy: తొలి చిత్రం ‘మంచుపల్లకి’ తర్వాత వంశీ అన్నీ స్ట్రయిట్ మూవీసే తీశారు. అందుకొన్ని సూపర్ హిట్ అయితే… మరికొన్ని హిట్ అయ్యాయి. ఇంకొన్ని సినిమాలు ఫర్వాలేదనిపించాయి. కానీ వంశీకి బ్యాడ్ రిమార్క్ తెచ్చిన సినిమాలు వీటిలో లేవనే చెప్పాలి. రీమేక్స్ చేయడానికి ఇష్టం లేకపోయినా… వంశీ చేసిన మరో రీమేక్ మూవీ ‘చెట్టుకింద ప్లీడర్’.
వంశీ మొదటి చిత్రం ‘మంచుపల్లకి’ తమిళ రీమేక్ అయితే… అది వచ్చిన ఏడేళ్ళ తర్వాత వంశీ ఈసారి మలయాళ చిత్రాన్ని రీమేక్ చేశారు. మల్లూవుడ్ లో ‘తంత్రమ్’గా రూపుదిద్దుకున్న ఈ సినిమా రీమేక్ ‘చెట్టుకింద ప్లీడర్’లో రాజేంద్ర ప్రసాద్, కిన్నెర, ఊర్వశీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకూ ఇళయరాజానే సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో తనికెళ్ళ భరణీ పోషించిన పాత ఇనుప సామాన్లు కొంటాం అని తిరిగే పాత్ర సూపర్ హిట్… కానీ సినిమా మాత్రం సూపర్ ఫ్లాప్!
కెరీర్ ప్రారంభంలో వంశీకి దన్నుగా నిలిచిన వ్యక్తి ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. ‘మంచుపల్లకి’ పరాజయం తర్వాత ఆయనే పిలిచి ‘సితార’ సినిమాతో వంశీని డైరెక్టర్ గా నిలబెట్టారు. అలాంటి ఏడిద నాగేశ్వరరావు తన కొడుకు శ్రీరామ్ ను హీరో చేయాలనుకుని అతన్ని వంశీ చేతుల్లోనే పెట్టాడు. అలా రూపుదిద్దుకున్న సినిమా ‘స్వరకల్పన’. సీత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది.
Director Vamsy: వంశీ సినిమా అంటే ఇది కదా! అనిపించుకున్న మరో చిత్రం ‘ఏప్రిల్ ఒకటి విడుదల’. కోలపల్లి ఈశ్వర్, ఎం.ఐ. కిషన్ రాసిన ‘హరిశ్చంద్రుడు అబ్బద్దం ఆడితే’ నవలతో తెరకెక్కిన ఈ సినిమాతో వంశీ మరోసారి తానేమిటో నిరూపించుకున్నారు. ‘చెట్టుకింద ప్లీడర్, స్వరకల్పన’ పరాజయాలతో వంశీ పైపోయిందని వచ్చిన వార్తలను వమ్ము చేస్తూ… ‘ఏప్రిల్ ఒకటి విడుదల’ మరోసారి వంశీ సత్తాను చాటింది.
Director Vamsy: సినిమా రంగంలో జయాపజయాలు సహజంగా… ఎంత గొప్ప దర్శకుడైనా ఎప్పుకోకప్పుడు పరాజయాలకు తలొగ్గాల్సిందే. కానీ చిత్రంగా వంశీ ఒకటి కాదు రెండు కాదు… వరుసగా పరజయాలతో ప్రయాణించారు. ‘ఏప్రిల్ ఒకటి విడుదల’తో తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వంశీ వచ్చారని భావించిన తరుణంలోనే మోహన్ బాబు, మోహినితో తీసిన ‘డిటెక్టివ్ నారద’, రాజేంద్ర ప్రసాద్ తో చేసిన ‘జోకర్’, ‘ప్రేమా అండ్ కో’, ‘నీకు పదహారు నాకు 18’ చిత్రాలు వరసగా ఫ్లాప్ అయ్యాయి. వంశీకి బాగా అచ్చివచ్చిన స్రవంతి మూవీస్ సంస్థ నుండి వచ్చిన ‘లింగబాబు లవ్ స్టోరీ’ సైతం నిరాశకు గురిచేసింది.
కొందరు దర్శకులంటే యంగ్ డైరెక్టర్స్ కు ఎంతో ఇష్టం. వాళ్ళను చూసి, వాళ్ళ టాలెంట్ ను చూసి… తాము దర్శకులు కావాలని తపించే కుర్రాళ్ళు ఎంతోమంది ఉంటారు. వంశీ కూడా అలాంటి మోటివేషన్ కలిగించే దర్శకుడు. అందుకే వంశీకి ఓ మంచి అవకాశం ఇవ్వాలని తప్పించిన రామ్ గోపాల్ వర్మ ఆయనతో ‘వైఫ్ ఆఫ్ వరప్రసాద్’ మూవీని ప్రొడ్యూస్ చేశారు. వినీత్, చక్రవర్తి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ మ్యూజికల్ గా హిట్ అయ్యింది కానీ కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. దాంతో కొన్నేళ్ల పాటు వంశీ చిత్రసీమకు దూరమై పోయారు.
వెలుగు వెనుక చీకటి ఉన్నట్టే… చీకటి తర్వాత వెలుగు రావడం కూడా అంతే సహజంగా! వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ కొన్ని ఊహించని ఎదురుదెబ్బలు తిన్న వంశీ దాదాపు ఐదేళ్ళ పాటు సొంతూరికి వెళ్ళిపోయారు. మానసికంగా కాస్తంత కుదుట పడిన తర్వాత ‘ఔను వాల్ళిద్దరూ ఇష్టపడ్డారు’తో బౌన్స్ బ్యాక్ అయ్యారు.
Director Vamsy: వంశీ హీరోయిన్ల కంటూ ఓ స్టైల్ ఉంటుంది. విశాలమైన కళ్ళు, పొడవాటి జడ, కాటన్ శారీ… స్వచ్ఛమైన చిరునవ్వు… ఇలాంటి కథానాయికను మళ్ళీ ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’లో వంశీ తెర మీద చూపించారు. నిజానికి ఈ సినిమా కోసం మొదట లయను హీరోయిన్ గా అనుకున్నారు. రాజశేఖర్ ‘శేషు’ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన కళ్యాణిని చూసిన తర్వాత మేకర్స్ ఆలోచన మారింది. రవితేజ సరసన కళ్యాణీని హీరోయిన్ గా పెట్టి వంశీ తెరకెక్కించిన ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ తిరిగి వంశీని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. వంశీ అంటే ఎంతో అభిమానం ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ వల్లూరిపల్లి రమేశ్ జెమినీ కిరణ్ తో కలిసి ‘మహర్షి టాకీస్’ బ్యానర్ లో ఈ సినిమాను తీశారు. తాను కొంతకాలం అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు పరిషత్ నాటకాల్లో చూసిన కొండవలసను, ద్రాక్షారామం సరోజను ఈ సినిమాలో ఉపయోగించుకున్నారు వంశీ.
సినిమా రంగానికి వంశీ దూరంగా ఉండి ఉండొచ్చు. కానీ ఆయన మార్క్ సినిమాలను ఇష్టపడే నిర్మాతలు మాత్రం అప్పుడు ఇప్పుడూ ఎప్పుడూ ఉంటారు. అందుకే వంశీ తిరిగొచ్చి సినిమాలు చేయడం మొదలు పెట్టగానే నిర్మాత ఎం.ఎల్. కుమార్ చౌదరి ‘దొంగరాముడు అండ్ పార్టీ’ మూవీ నిర్మించారు. ప్రముఖ నిర్మాత దొరస్వామి రాజు ‘కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను’ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. కానీ ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ప్రముఖ దర్శక నిర్మాత ఇవీవీ సత్యనారాయణ… దర్శకుడు వంశీలది చిరకాల అనుబంధం. వంశీ దర్శకుడుగా నిలదొక్కుకుంటున్న సమయంలోనే ఇవీవీ సహాయ దర్శకుడిగా పనిచేస్తుండేవాడు. ఇవీవీకీ వంశీ అంటే తెగని ఇష్టం. అందుకే వంశీ దర్శకత్వంలో ‘అనుమానాస్పదం’ సినిమా చేయమంటూ తన కొడుకు ఆర్యన్ రాజేష్ ను ప్రోత్సహించాడు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ మూవీలో వంశీ ‘ప్రతి దినం నీ దర్శనం…’ పాటను రాశారు. ఈ సినిమా ఆడకపోయినా… ఆ పాట మాత్రం కాలర్ ట్యూన్ గా మారిపోయి… ఆడియో కంపెనీలకు లక్షల్లో లాభాలను తెచ్చిపెట్టింది.
Director Vamsy: గోదావరి జిల్లాలో పుట్టిన వంశీకి ఆ ప్రాంతమన్నా, ఆ నదీ తీరమన్నా ప్రాణం. అలానే అరకు లోయ అంటే వంశీ ప్రాణం పెట్టేస్తారు. గోదావరి నదిని తన సినిమాలో చూపకుండా వంశీ గుమ్మడికాయ కొట్టిన సందర్భంగా ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య గోదారి తీరంలోని సినిమా చెట్టు నేలకు ఒరిగినప్పుడు వంశీ తల్లడిల్లారు. ఆ చెట్టును తిరిగి నిలబెట్టడం కోసం విశ్వ ప్రయత్నం చేశారు. అలాంటి వంశీ గోదారి పేరును ‘గోపీ గోపికా గోదావరి’ అంటూ ఓ సినిమాకు పెట్టేశారు. వేణు హీరోగా నటించిన ఈ సినిమా మ్యూజికల్ గా హిట్టయ్యింది. ఇళయరాజా తర్వాత వంశీ విశేషంగా అభిమానించిన సంగీత దర్శకుడు చక్రి. వంశీ.. చక్రీ కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రాల మాదిరే ఇందులోని పాటలూ శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇవీవీ సత్యనారాయణ కొడుకులు ఆర్యన్ రాజేశ్, అల్లరి నరేశ్ ఇద్దరితో సినిమాలు చేసిన దర్శకులు చాలా తక్కువ. అందులో ఒకరు వంశీ. అప్పటికే ఆర్యన్ రాజేశ్ తో ‘అనుమానాస్పదం’ తెరకెక్కించిన వంశీ… నరేశ్ హీరోగా రూపొందించిన మూవీ ‘సరదాగా కాసేపు’. బట్… ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి సరదాను ఇవ్వలేకపోయింది. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ తో వరుస పరాజయాలను అందుకున్న వంశీకి మరోసారి లాంగ్ గ్యాప్ ఈ సినిమా తర్వాత వచ్చింది.
‘సరదాగా కాసేపు’ తర్వాత దాదాపు ఆరేళ్ళ పాటు వంశీ సినిమా మరేదీ రాలేదు. గతంలో ఎప్పుడో ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ‘మేఘమాల’ నవల అంటే ఇష్టపడిన వంశీ దానిని తెరకెక్కించాలని అనుకున్నారు. ‘తను మొన్నే వెళ్ళిపోయింది’ పేరుతో సినిమాగా తీశారు. కానీ అది రకరకాల పేర్లు మార్చుకుని… చివరకు ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ పేరుతో విడుదలైంది. కానీ పరాజయం పాలైంది. ఈ సినిమా తర్వాత వంశీ మీద అభిమానంతో ‘మధుర’ శ్రీధర్ ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ మూవీని నిర్మించారు. ఈ సినిమా మ్యూజికల్ గా ఫర్వాలేదనిపించినా వంశీ మార్క్ మ్యాజిక్ ను మిస్ అయ్యింది. దాంతో ఇదీ ఆడలేదు. ఆ తర్వాత వంశీ మళ్ళీ మెగాఫోన్ చేతిలోకి తీసుకోలేదు.
Director Vamsy: మంచి రచయితలంతా మంచి దర్శకులు కావాలని లేదు. కానీ వంశీ దర్శకుడిగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో రచయితగానూ అంతే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటు తెలుగు సినిమాకు, అటు తెలుగు సాహిత్యానికి తనదైన సేవలను ఆయన చేశారు. గోదావరి నేపథ్యంలో ఆయన రాసిన ‘మా పసలపూడి కథలు’ పై కె. రామచంద్రారెడ్డి పీహెచ్ డీ చేశారు. అలానే దిగువ గోదావరి కథలు పేరుతో వంశీ వందల కథలను రాశారు. కథా రచయితగా, నవల రచయితగా కూడా వేలాది మందిని వంశీ ఇన్ స్పైర్ చేశారు. ప్రస్తుతం సినిమా రూపకల్పనకు ఆయన దూరంగా ఉన్నా… తన మనసులోని భావాలను సొంత యూ ట్యూబ్ ద్వారా తన అభిమానులకు అందిస్తూనే ఉన్నారు. అయితే… వారిని ప్రేక్షకుల అభిరుచిని దృష్టి లో పెట్టుకుని వంశీ త్వరలో ఓ వెబ్ సీరిస్ తీసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.
వంశీ కేవలం రచయిత, దర్శకుడు మాత్రమే కాదు… మ్యూజిక్ డైరెక్టర్, రిలిసిస్ట్, కొరియోగ్రాఫర్, సింగర్… కాస్ట్యూమ్ డిజైనర్… వాట్ నాట్!! సినిమా రంగంలోని ప్రతి శాఖపైనా పట్టు ఉన్న వంశీ లాంటి వ్యక్తులు చాలా రేర్… అలాంటి అరుదైన దర్శకుడి నుండి మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరుకుందాం… మరోసారి వంశీకి హ్యాపీ బర్త్ డే !