PM Modi: 

PM Modi: వందేమాతరం కేవలం పాట కాదు..150 ఏళ్ల ప్రయాణంపై పార్లమెంటులో ప్రత్యేక చర్చ

PM Modi: వందేమాతరం కేవలం ఒక పాట కాదు, అది రాముడి భారత్ దార్శనికతను, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన యుద్ధ నినాదాన్ని ప్రతిబింబిస్తుంది – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త ఊపిరి పోసిన ‘వందేమాతరం’ గీతం 150వ వార్షికోత్సవం సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక చర్చకు వేదికైంది. భారత చరిత్రలో ఈ గీతానికున్న అపారమైన ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ ఈ చర్చను ప్రారంభించారు.

‘వందేమాతరం’ – యుద్ధ నినాదం

బంకిం చంద్ర చటోపాధ్యాయ్ నవంబర్ 7, 1875న తన ‘బంగదర్శన్’ పత్రికలో తొలిసారిగా ప్రచురించిన ఈ గీతం, అనతికాలంలోనే బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు దేశవ్యాప్తంగా ఉన్న స్వాతంత్ర్య సమరయోధులను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. 1905లో జరిగిన బెంగాల్ విభజన వ్యతిరేక ఆందోళనలో దీనిని రాజకీయంగా వినియోగించడం మొదలుపెట్టాక, ఇది దేశానికి స్ఫూర్తినిచ్చి, సాధికారతను కల్పించిన శక్తిగా మారింది.

“వందేమాతరం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక యుద్ధ నినాదం,” అని ప్రధాని మోడీ అభివర్ణించారు. బంకిం చంద్ర చటోపాధ్యాయ ఈ పాట ద్వారా బ్రిటిష్‌ వారిని సవాలు చేశారని గుర్తుచేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Telangana Rising Global Summit: నేడే ప్రారంభం.. ఫ్యూచర్‌ సిటీకి చేరుకుంటున్న ప్రపంచ ప్రతినిధులు

చర్చ నేపథ్యం & ప్రాముఖ్యత

రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో, 150 ఏళ్ల ‘వందేమాతరం’ గీతం ప్రయాణం గురించి చర్చించడం మనందరి అదృష్టమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ చర్చ చరిత్రతో ముడిపడిన అనేక ఘట్టాలను కళ్ళ ముందుకు తీసుకువస్తుందని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్లమెంటులో ఈ అంశంపై ఏకంగా 10 గంటలు చర్చకు కేటాయించడం దీని ప్రాధాన్యతను సూచిస్తోంది. ప్రధాని మోడీ తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, ప్రియాంకాగాంధీ వంటి ప్రముఖులు ప్రసంగించనున్నారు. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా ఈ చర్చను ప్రారంభించనున్నారు.

వందేమాతరం చారిత్రక ఘట్టాలు

ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వందేమాతరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు భారతదేశం పరాయి పాలనలో ఉందని, 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)లో ఉందని పేర్కొంటూ కాంగ్రెస్ పాలనను ప్రస్తావించారు.

చివరికి, స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత, ఈ చారిత్రక గీతాన్ని జనవరి 24, 1950న జాతీయ గీతంతో సమానంగా పరిగణించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించి, ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *