Sirish: రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా పరాజయం తరువాత, తాజాగా నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీయడంతో వారు తీవ్రంగా స్పందించారు. ఇదే చివరి హెచ్చరిక అంటూ ఓ ఓపెన్ లెటర్ కూడా విడుదల చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో శిరీష్ రెడ్డి స్పందిస్తూ ఓ లేఖను విడుదల చేశారు. అందులో ఆయన ఇలా పేర్కొన్నారు:
“నాకు తెలిసినంతవరకూ నా మాటలు కొందరు అభిమానులను బాధించాయి. గేమ్ చేంజర్ కోసం రామ్ చరణ్ గారు పూర్తి సహకారం అందించారు. మేము మెగా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాము. నా మాటలు ఎవరి మనసునైనా బాధ కలిగించాయంటే నిజంగా క్షమించండి.”
అయితే అసలు వివాదం ఎలా మొదలైంది?
శిరీష్ తమ్ముడు సినిమా ప్రమోషన్లలో మాట్లాడుతూ..
“గేమ్ చేంజర్ ప్లాప్ అయింది. ఆ సినిమా వలన మేము పూర్తిగా నష్టపోయాం. ఆ సమయంలో రామ్ చరణ్ గారు గానీ, డైరెక్టర్ శంకర్ గారు గానీ ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు. ‘మీ పరిస్థితి ఏంటి?’ అని ఒక్కసారి కూడా అడగలేదు. అయితే నేనవాళ్లను తప్పుపట్టడం లేదు.” అని అన్నారు.
ఈ వ్యాఖ్యలు రామ్ చరణ్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీశాయి. చరణ్ అంతా ఇచ్చి పనిచేసిన సమయంలో ఇలా మాట్లాడడం తగదని అభిప్రాయపడుతూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
అయితే దీనిపై దిల్ రాజు కూడా స్పందించారు.
“శిరీష్ కు ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. కాస్త ఎమోషనల్ అయి అలా మాట్లాడాడు. మా ఉద్దేశ్యం ఎప్పుడూ మెగా ఫ్యామిలీ ప్రతిష్ఠను కాపాడడమే.” అని చెప్పారు.
ఈ వివాదం తర్వాత శిరీష్ క్షమాపణ లేఖతో విషయాన్ని ముగించాలని యత్నించారు. ప్రస్తుతం ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ నుంచి ఇంకా ప్రతిస్పందనలు వస్తున్నాయి. ఈ వ్యవహారం గేమ్ చేంజర్ సినిమా చుట్టూ మరోసారి చర్చను రేకెత్తించింది.


