Pawan Kalyan: కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఫార్మా పరిశ్రమల కాలుష్యం కారణంగా తమ జీవనోపాధికి నష్టం వాటిల్లుతోందని ఆందోళన చేస్తున్న మత్స్యకారుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
మత్స్యకారుల సమస్యలను లోతుగా అధ్యయనం చేసి, పరిష్కార మార్గాలు సూచించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ కమిటీలో కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, మత్స్య, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్‌తో పాటు, మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులకు కూడా స్థానం కల్పిస్తామని తెలిపారు. ఈ కమిటీ జీవనోపాధి మెరుగుదల, తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నష్ట పరిహారం మదింపు వంటి అంశాలపై దృష్టి పెడుతుందని వివరించారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
తక్షణ సమస్యలపై దృష్టి
అసెంబ్లీ సమావేశాల కారణంగా స్వయంగా వచ్చి మత్స్యకారులతో చర్చించలేకపోతున్నానని తెలిపిన పవన్ కల్యాణ్, సోమవారం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తున్నానని వెల్లడించారు. ఇప్పటికే తక్షణమే పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఇటీవల మృతి చెందిన 18 మంది మత్స్యకారుల కుటుంబాలకు బీమా చెల్లింపు, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లో దెబ్బతిన్న పడవల నష్ట పరిహారంపై అధికారులతో చర్చించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. అలాగే, మచిలీపట్నం, అంతర్వేది వంటి ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు అవకాశం కల్పించడంపైనా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించినట్లు తెలిపారు. ఈ అంశాలను కమిటీ నివేదిక కోసం ఎదురుచూడకుండా ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Local Body Elections 2025: బీసీ రిజర్వేషన్ల జీవో నిలిచేనా? తెలంగాణలో అసలు స్థానిక ఎన్నికలు జరిగేనా?
ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు
ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి, వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. సీఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కష్టజీవులకు భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత స్వయంగా ఉప్పాడకు వచ్చి మత్స్యకారులతో అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉప్పాడలో మత్స్యకార కుటుంబాలు రెండో రోజు కూడా నిరసనలు కొనసాగించాయి. ఉదయం నుంచి రహదారులను మూసివేసి ధర్నా చేపట్టగా, జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మత్స్యకారులతో చర్చించి, ప్రభుత్వం తరపున సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.