Kartavya Bhavan: దేశ రాజధాని ఢిల్లీలో ఆధునిక పాలనా వ్యవస్థకు నాంది పలుకుతూ కర్తవ్య భవన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు ఈ నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం 6 గంటలకు కర్తవ్యపథ్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కర్తవ్య భవన్ నిర్మాణం జరిగింది. ఈ ప్రాజెక్ట్‌లో కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ వంటి శతాబ్దాల చరిత్ర కలిగిన భవనాలను ఆధునీకరించి, వాటి స్థానంలో కొత్త భవనాలను నిర్మిస్తున్నారు.
పాత భవనాలకు కొత్త రూపం:
బ్రిటీష్ పాలనలో నిర్మించిన నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ భవనాలు ఇప్పటివరకు ప్రధాని కార్యాలయం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ, హోంశాఖ వంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖలకు కేంద్రంగా ఉండేవి.
ఇప్పుడు ఈ భవనాలను సంగ్రహాలయాలు (మ్యూజియాలు)గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 5,000 సంవత్సరాల భారతీయ చరిత్రను ప్రదర్శించనున్నారు.
నార్త్ బ్లాక్‌లో శిల్ప సంపదను, సౌత్ బ్లాక్‌లో ఆధునిక సాంకేతికతతో త్రీడీ ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్పు రెండేళ్లలో పూర్తవుతుందని అంచనా.
Also Read: UPI వినియోగదారులకు షాక్: డిజిటల్ చెల్లింపులపై ఛార్జీల భారం
కర్తవ్య భవన్ ప్రత్యేకతలు :
కొత్తగా నిర్మించిన ఈ కార్యాలయ భవనాలకు కర్తవ్య భవన్ అని పేరు పెట్టారు. ఇప్పటికే ప్రారంభానికి సిద్ధంగా ఉన్న భవనానికి కర్తవ్య భవన్-3 అని పేరు పెట్టారు.
ఇది 1.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో, రెండు బేస్‌మెంట్‌లు, ఆరు అంతస్తులతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు.
ఈ భవనంలో హోం వ్యవహారాల, విదేశాంగ, గ్రామీణాభివృద్ధి, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖలు వంటి వివిధ విభాగాల కార్యాలయాలు ఉంటాయి.
కర్తవ్య భవన్-3 పర్యావరణ అనుకూల భవనం. దీనిలో 30% తక్కువ విద్యుత్తు వినియోగం, ఇంధన ఆదా చేసే LED లైట్లు, సెన్సార్లు, స్మార్ట్ లిఫ్ట్‌లు ఉంటాయి.
పైకప్పుపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాలు ఏటా 5.34 లక్షల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి.
ఈ కొత్త భవనాల నిర్మాణం, పాత భవనాల పునరుద్ధరణతో ఢిల్లీలోని పాలనా వ్యవస్థ మరింత సమర్థవంతంగా, ఆధునికంగా మారనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.