Delhi: రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడానిuకి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని, రక్షణశాఖ ఆధునిక ఆయుధాలు మరియు సైనిక పరికరాల కొనుగోలుకు భారీ స్థాయిలో ఆమోదం తెలిపింది. మొత్తం రూ.79 వేల కోట్ల విలువైన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన రక్షణ కొనుగోలు మండలి (Defence Acquisition Council – DAC) సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ప్రతిపాదనల్లో దేశీయంగా తయారయ్యే క్షిపణి వ్యవస్థలు, టార్పిడోలు, ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలు, సైనిక వాహనాలు వంటి పరికరాల కొనుగోలు ఉంది. ఈ ప్రాజెక్టులు రక్షణ రంగంలో సాంకేతిక ఆధునీకరణకు దోహదం చేయనున్నాయి.
ప్రత్యేకంగా నాగ్ క్షిపణి వ్యవస్థ (NAMIS), సముద్ర రక్షణకు ఉపయోగపడే ఆధునిక టార్పిడోలు, అలాగే సరిహద్దు ప్రాంతాల్లో పహారా కోసం ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించారు. ఈ చర్యలతో భారత సాయుధ దళాల ప్రతిస్పందన సామర్థ్యం, రక్షణ మౌలిక వసతులు మరింత బలపడనున్నాయి.
ఈ నిర్ణయాలు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలకమైన మైలురాయిగా నిలవనున్నాయి. దేశీయ రక్షణ సంస్థలు, ప్రైవేట్ పరిశ్రమలు, సాంకేతిక సంస్థలకు కొత్త అవకాశాలు లభించనున్నాయి. అంతేకాక, విదేశీ ఆధారాన్ని తగ్గించి దేశీయ తయారీ శాతాన్ని పెంచడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యంగా రక్షణశాఖ పేర్కొంది.
భారత రక్షణశాఖ ఈ నిర్ణయాల ద్వారా “దేశ భద్రతే మొదటి ప్రాధాన్యత” అనే సూత్రాన్ని మరలా స్పష్టం చేసింది. ఈ చర్యలతో భారత రక్షణ రంగం సాంకేతికంగా మరింత అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే స్థాయికి చేరుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.