No Credibility Serve: కోల్‌కతాలో సోనాగచి, ముంబైలో కామాటిపురా, ఢిల్లీలో జీబీ రోడ్.. అందరికీ తెలిసే వ్యభిచారం జరిగే రెడ్ లైట్ ఏరియాలివి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో సెక్స్ వర్కర్లకు కేంద్రాలైన అలాంటి వ్యవస్థీకృత ప్రాంతాలు ఎక్కడా లేవు. హైదరాబాద్‌లోనూ, ఏపీలోని ఇతర నగరాల్లోనూ అలాంటి హాట్‌స్పాట్‌లు ఎక్కడా లేనప్పుడు, అమరావతిని “వేశ్యల రాజధాని”గా చిత్రీకరించడం దేనిని సూచిస్తుంది. 2025 జూన్ 2న ప్రచురితమైన టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం, దేశంలో 9,95,499 సెక్స్ వర్కర్లలో ఆంధ్రప్రదేశ్‌లో 12%, తెలంగాణలో 7.6% ఉన్నారని పేర్కొంది. కానీ, ఈ సర్వేకు ప్రామాణికత ఏమిటి? సెక్స్ వర్క్ చట్టవిరుద్ధం. అందువల్ల ఖచ్చితమైన గణాంకాలు సేకరించడం అసాధ్యం. గుర్తించిన వారి ఆధారంగా తయారైన ఈ రిపోర్టు నమ్మదగినదేనా? కోల్‌కతా, ముంబై, ఢిల్లీలో స్పష్టంగా కనిపించే సెక్స్ వర్కర్ల కంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువమంది ఉన్నారని ఎలా గుర్తించారు? అందుకే.. ఈ నివేదిక వెనుక రాజకీయ కుట్ర ఏమైనా దాగి ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సెక్స్ వర్కర్లు అధికంగా ఉన్న రాష్టాలలో కర్ణాటక అగ్ర స్థానంలో ఉంటే, ఆంధ్ర ప్రదేశ్ రెండో స్థానంలో ఉందని, తెలంగాణ ఐదో స్థానంలో ఉందని సదరు సర్వే తేల్చేసింది. ఈ సర్వే ప్రత్యేకంగా పేర్కొనలేదు కానీ… దక్షిణాది రాష్ట్రాలు వ్యభిచారానికి నిలయాలు అన్న స్టేట్మెంటే ఇందులో అంతర్లీనంగా ఉందన్నది స్పష్టం. అయితే రాష్ట్రానికి సంబంధించిన సర్వే వివరాలను.. దురుద్దేశ పూరితంగా అమరావతికి అప్లై చేసేశారు మన వ్యవస్థలోని కొందరు మేధావులు. అమరావతిపై తప్పుడు ముద్ర వేసి, ఆ ప్రాంత మహిళలను అవమానించేందుకు కొందరు పన్నిన ఈ ఆటలో.. లేని సర్వేలు, తప్పుడు గణాంకాలు ఆయుధాలయ్యాయి. అందుకే ఈ తరహా సర్వేలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలన్న అభిప్రాయాలు నేడు వ్యక్తమవుతున్నాయి.
No Credibility Serve: వ్యభిచారం ప్రపంచవ్యాప్తంగా, పురాతన కాలం నుంచి ఉంది. ప్రభుత్వాలు నిషేధించినా, అది కొనసాగుతూనే ఉంది. కానీ, ఈసమస్యను నిర్మూలించకుండా, దాన్ని రాజకీయంగా వాడుకుని, ఒక ప్రాంతాన్ని, దాని మహిళలను అపఖ్యాతి పాలు చేయడం హీనమైన నేరం. ఇలాంటి కుట్రలు అమరావతి గౌరవాన్ని దెబ్బతీస్తాయని నీచులెవరైనా భావిస్తే… ప్రజల ఆగ్రహం, చట్టమే దానికి సమాధానం చెబుతాయి.