Crime News: రెండు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల హిజ్రాల ఆగడాలు మితిమీరుతున్నాయి. పట్టణాల నుంచి పల్లెల దాకా హిజ్రాల నిర్వాకాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. బస్టాండ్లు, దుకాణాల్లో, రోడ్లపై వాహనాలను ఆపి వసూళ్లకు పాల్పడుతున్నారు. నగదు అడిగినంత ఇవ్వకపోతే ఏకంగా హిజ్రాలు దాడులకు తెగబడుతున్న ఘటనలు బయటకొస్తున్నాయి. కొన్నిచోట్ల హిజ్రాలు గ్రూపులుగా తయారై వివాహ, ఇతర శుభకార్యాలు జరిగే చోటుకు వెళ్లి వేలకు వేలు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇవ్వకపోతే శాపనార్థాలు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
Crime News: తాజాగా గృహప్రవేశం చేసిన ఓ ఇంటి యజమాని తాము అడిగినంత ఇవ్వలేదన్న కోపంతో హిజ్రాల గుంపు దాడికి తెగబడింది. తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం చీర్యాల సమీపంలో జరిగింది. అక్కడి బాలాజీ ఎన్‌క్లేవ్‌లో సదానందం అనే వ్యక్తి కుటుంబం ఇటీవలే ఇల్లు కట్టుకొని నవంబర్ 10న గృహప్రవేశం చేశారు.
Crime News: ఈ విషయం తెలిసిన హిజ్రాలు కొందరు సదానందం ఇంటికి వెళ్లారు. రూ.1 లక్ష ఇవ్వాలని ఆ కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తం ఇచ్చేందుకు ఆ కుటుంబం నిరాకరించింది. తన శక్తిమేరకు ఇస్తానన్న నగదు తీసుకెళ్లకుండా హిజ్రాలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక వెళ్లిపోయారని ఆ కుటుంబం భావిస్తున్న తరుణంలో 15 మందితో కలిసి హిజ్రాల గుంపు ఆ ఇంటి మీదికి వచ్చింది.
Crime News: వచ్చీరావడంతోనే సదానందం, ఇతర కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా హిజ్రాలు దాడికి తెగబడ్డారు. ఇష్టారీతిన వారిని కొట్టసాగారు. ఎంతగా మొత్తుకున్నా వినకుండా దాడికి దిగారు. హిజ్రాల దాడిలో సదానందం తలకు తీవ్ర గాయమైంది. ఇతర కుటుంబ సభ్యులకు కూడా గాయాలయ్యాయి. బాధితుడు సదానందం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

