Congress Party: తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గపోరు తారస్థాయికి చేరుకున్నది. ఇరువర్గాల మధ్య తరచూ వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎక్కడ మీటింగ్ పెట్టినా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వర్గీయుల మధ్యన వర్గపోరు ఘర్షణలకు తావిస్తున్నది. ఈ నేపథ్యంలో తాజాగా అర్వపల్లి, మోత్కూరు, తుంగతుర్తిలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో వైరి వర్గాలు మారి ఒకరిపై మరొకరు దూషణల పర్వంతో ఘర్షణల వరకూ దారితీసింది.
Congress Party: అర్వపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రారంభానికి ముందే కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి గంట ముందు సభా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే సామేలు వర్గీయులు, ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫొటో చిన్నగా వేశారని, ప్రొటోకాల్ పాటించలేదని ఘర్షణకు దిగడంతో ఇరువర్గాల నడుమ తోపులాటకు దారితీసింది.
Congress Party: ఈ ఘర్షణలో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టాల్సి వచ్చింది. ఒకరిపై ఒకరు నినాదాలతో దూషించుకోవడంతో పోలీసులు వారించబోయారు. అయినా ఎవరూ తగ్గకపోవడంతో లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Congress Party: తుంగతుర్తిలో మందుల సామేలుపై దామోదార్‌రెడ్డి వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తున్నది. ఊరూరా తమ వర్గం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని సామేలును గెలిపించామని, గెలిచాక మాత్రం పాత కాంగ్రెస్ నాయకులను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తన వెంట టీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే అంటే గిట్టనివారే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే నియోజకవర్గంలో కాంగ్రెస్ మనుగడ కష్టమేనని కార్యకర్తలే ఆవేదన చెందుతున్నారు.