Separate State Demand

Separate State Demand: మాకు కూడా ప్రత్యేక రాష్ట్ర కావాలి.. ప్రధాని.. రాష్ట్రపతికి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ..

Separate State Demand: ఉత్తర కర్ణాటక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలనే డిమాండ్ మరోసారి బలంగా తెరపైకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే రాజు కేజ్ ఈ అంశంపై ఏకంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రికి లేఖ రాయడం ద్వారా ఈ ఉద్యమానికి మళ్లీ ఊపిరి పోశారు. గతంలో దివంగత నాయకుడు ఉమేష్ కత్తి లేవనెత్తిన ఈ డిమాండ్‌ను బలంగా వినిపిస్తున్న తొలి ఎమ్మెల్యేగా రాజు కేజ్ నిలిచారు.

ఎమ్మెల్యే రాజు కేజ్ లేఖ అనంతరం ఉత్తర కర్ణాటక హోరాట సమితి (UKHS), ఉత్తర కర్ణాటక వికాస్ వేదిక వంటి సంఘాలు తమ డిమాండ్లను మరింత తీవ్రతరం చేశాయి.

సంచలనం రేపుతున్న హెచ్చరిక

ఉత్తర కర్ణాటక హోరాట సమితి ఈ సందర్భంగా ఒక సంచలన హెచ్చరిక జారీ చేసింది. బెల్గాంలో జరగనున్న రాబోయే శీతాకాల సమావేశాల్లో తమ మూడు ప్రధాన డిమాండ్లను నెరవేర్చకపోతే, కర్ణాటక శాసనసభ భవనంపై ప్రత్యేక రాష్ట్ర జెండాను ఎగురవేస్తామని హెచ్చరించడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఎమ్మెల్యే లేఖలోని కీలక అంశాలు

బెల్గాం జిల్లాకు చెందిన కగ్వాడ్ ఎమ్మెల్యే రాజు కేజ్, రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకంగా తన సొంత ప్రభుత్వంపైనే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నవంబర్ 4న లేఖ రాశారు. పరిపాలనా సౌలభ్యం మరియు సమగ్ర అభివృద్ధి కోసం ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరారు.

మొత్తం 15 జిల్లాలతో కూడిన ఉత్తర కర్ణాటకను వేరు చేయాలని అభ్యర్థించారు. ఇందులో బీదర్, కలబురగి, విజయపుర, యాద్గిర్, బాగల్‌కోట్, బెళగావి, ధార్వాడ్, గడగ్, కొప్పల్, రాయచూర్, ఉత్తర కన్నడ, హవేరి, విజయనగరం, బళ్లారి, మరియు దావణగెరె జిల్లాలు ఉన్నాయి.

అభివృద్ధి విషయంలో ఉత్తర కర్ణాటక జిల్లాలకు నిరంతరం అన్యాయం జరుగుతుందని, దక్షిణ కర్ణాటక ప్రభుత్వం సవతి తల్లి వైఖరితో వివక్ష చూపుతోందని ఆయన లేఖలో ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కోటి మందికి పైగా సంతకాలతో కూడిన అభిప్రాయాలు అందాయని, ఈ పోరాటానికి తనకు పూర్తి మద్దతు ఉందని రాజు కేజ్ తెలిపారు.

దివంగత ఉమేష్ కత్తి వ్యాఖ్యలకు మళ్లీ ప్రాధాన్యత

దివంగత నాయకుడు ఉమేష్ కత్తి గతంలోనే ఈ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను బలంగా వినిపించారు. “దేశంలో జనాభా పెరిగే కొద్దీ రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో రెండు, ఉత్తరప్రదేశ్‌లో ఐదు, మహారాష్ట్రలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి. దేశం మొత్తం 50 రాష్ట్రాలుగా విభజించాలి” అని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి.

పోరాటానికి ఎమ్మెల్యే కేజ్ నాయకత్వం

ఎమ్మెల్యే రాజు కేజ్, ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి తాను నాయకత్వం వహిస్తానని బహిరంగంగా ప్రకటించారు. “ఉత్తర కర్ణాటక విడిపోవాలని ముఖ్యమంత్రికి లేఖ రాశాను. ఈ పోరాటానికి నేను నాయకత్వం వహిస్తాను మరియు ప్రజల్లో అవగాహన కల్పించడానికి దానిని నిర్వహిస్తాను. ఉత్తర కర్ణాటకలోని అందరు ఎమ్మెల్యేలు మరియు ప్రజలు నాతో ఉన్నారని” ఆయన మీడియాతో అన్నారు. రాబోయే బెల్గాం శీతాకాల సమావేశాల్లో ఈ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ అంశం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించే అవకాశం ఉంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *