Drugs Overdose: హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద పార్క్ చేసి ఉన్న ఓ ఆటో రిక్షాలో ఇద్దరు యువకుల మృతదేహాలను స్థానికులు ఇవాళ ఉదయం గుర్తించారు. ఈ సమాచారంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.
డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో మరణించారా?
మృతులు పహడీషరీఫ్, పిసల్‌బండకు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. అయితే, వారి మృతిపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనా స్థలంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో డ్రగ్స్ ఇంజెక్షన్లు లభ్యం కావడం ఈ కేసులో కీలక మలుపు తిప్పింది.
ఇది కూడా చదవండి: Falcon Case: ₹792 కోట్ల మోసం కేసు.. నిందితుడి లగ్జరీ జెట్‌ను వేలం వేస్తున్న ఈడీ!
ఈ ఆధారాల నేపథ్యంలో, యువకులు అధిక మోతాదులో డ్రగ్స్ (ఓవర్‌డోస్) తీసుకోవడం వల్లే ప్రాణాలు కోల్పోయి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. డ్రగ్స్ సరఫరా, వినియోగం వెనుక ఉన్న ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో లోతుగా విచారిస్తున్నారు.
యువకుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. పోస్ట్‌మార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు లభించిన తర్వాతే వారి మృతికి గల కచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వినియోగం ఎంతగా విస్తరించిందో ఈ ఘటన మరోసారి కళ్లకు కట్టింది.

