Jr NTR: ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అభిమాన సంఘాలు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాయి.
ఎన్టీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి, అభ్యంతరకరమైన మరియు అసభ్యకరమైన రీతిలో పోస్టులు చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ… హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) వీసీ సజ్జనార్, ఐపీఎస్ గారికి ఫిర్యాదు అందజేశారు.
నందిపాటి మురళి జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధులు ఈ ఫిర్యాదును సమర్పించారు. ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్న ఆ మార్ఫింగ్ పోస్టులను తక్షణమే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు సీపీని కోరారు.
సోషల్ మీడియాలో సెలబ్రిటీల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపై సైబర్ క్రైమ్ నిబంధనల కింద చర్యలు తీసుకోవాలని అభిమానులు విజ్ఞప్తి చేశారు.