Nara Lokesh

Nara Lokesh: ఇచ్చిన మాట ప్రకారమే ప్రతిఏటా డిఎస్సీ .. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన

Nara Lokesh: ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ ఏడాది నవంబర్ చివరివారంలో టెట్, 2026 జనవరి లో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ నిర్వహించి, టీచర్ పోస్టులను భర్తీ చెయ్యాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… టెట్, డిఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని అన్నారు. కొత్త డిఎస్సీ నిర్వహణ తర్వాత వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలుచేయాలని సూచించారు. 2026 జనవరి లో నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ, స్పెషల్ డిఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి 423 విన్నపాలు తమ దృష్టికి రాగా, ఇప్పటికే 200 పరిష్కరించాం. మిగిలిన విన్నపాలు విధానపరమైన, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించినవని అధికారులు తెలిపారు. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపై లక్ష్యసాధనకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, బేస్ లైన్ టెస్ట్ నిర్వహణకు విధివిధానాలు రూపొందించాలని అన్నారు.

పదోతరగతి విద్యార్థులకు డిసెంబర్ కల్లా సిలబస్ పూర్తిచేసి, ఆ తర్వాత 100 రోజుల ప్రణాళిక ద్వారా మెరుగైన ఫలితాల సాధనకు కృషిచేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. 1నుంచి 5వతగరతి వరకు పాఠ్యప్రణాళిక సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. రాష్ట్రానికి కొత్తగా మంజూరైన 11 జవహర్ నవోదయ విద్యాలయాలకు సంబంధించిన పనులను త్వరగా ప్రారంభించేందుకు కార్యాచణ సిద్ధం చేయాలని కోరారు. నవంబర్ 26వతేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఆరోజున నిర్వహించనున్న స్టూడెంట్ అసెంబ్లీకి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ తోపాటు తాను కూడా హాజరవుతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 78మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను మెరుగైన విద్యాప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్ పర్యటనకు పంపించాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు. వచ్చే విద్యాసంవత్సరం విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద అందించాల్సిన స్టూడెంట్ కిట్స్ పై సమావేశంలో చర్చించారు.మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కడప స్మార్ట్ కిచెన్ మోడల్ ను రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల్లో అమలుచేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైస్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్ లు, ఇతర కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు.

Also Read: CM Chandrababu: సీఎంగా పదిహేనేళ్ల పరుగు చంద్రబాబు అరుదైన రికార్డు

అమరావతిలో రూ.100 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి సంబంధించి డిజైన్ కోసం హ్యాకథాన్ నిర్వహించి, బెస్ట్ మోడల్ ను ఎంపిచేయాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో లైబ్రరీల ఆధునీకరణకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల నుంచి రావాల్సిన లైబ్రరీ సెస్సును రాబట్టేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటీవల ప్రకటించిన షెడ్యూలుకు అనుగుణంగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు వందరోజుల ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా హైస్కూల్ ప్లస్ లను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. త్వరలో ప్రారంభించబోయే కలలకు రెక్కలు పథకం విధివిధానాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మానవవనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, కళాశాల విద్యాశాఖ డైరక్టర్ నారాయణ భరత్ గుప్త, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరక్టర్ బి.శ్రీనివాసరావు, పబ్లిక్ లైబ్రరీస్ డైరక్టర్ కృష్ణమోహన్, గ్రంథాలయ మౌలిక సదుపాయాల సంస్థ ఎండి దీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *