CMD vamsi: హైదరాబాద్ నగరం మరో పుణ్యక్షణానికి సాక్ష్యమివ్వబోతోంది. భక్తకోటి హృదయాలను ఆధ్యాత్మిక ఆనందంతో నిండబెట్టే శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
టీటీడీ ఆధ్వర్యంలో, మహాగ్రూప్స్ అధినేత మారెళ్ల వంశీకృష్ణ సంకల్పంతో జరుగుతున్న ఈ దివ్య కార్యక్రమం భక్తులకు అరుదైన అవకాశం. త్రైలోకసుందరుడు శ్రీవారికి, మహాలక్ష్మీ అమ్మవారికి జరగబోయే పవిత్ర కల్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించడం ప్రతి భక్తుడికి పుణ్యప్రదమనే చెప్పాలి.
దివ్య కళ్యాణ పోస్టర్ ఆవిష్కరణ
ఈ మహోత్సవానికి సంబంధించిన పోస్టర్ను ఇటీవల మహాగ్రూప్స్ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణ, వంశీరామ్స్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి, అపర్ణ గ్రూప్ చైర్మన్ సీవీ రెడ్డి, సుచిర్ ఇండియా సీఎండీ కిరణ్, స్వగృహ చైర్మన్ బీపీ నాయుడు, టీమ్ 4 అధినేత యార్లగడ్డ మురళి, కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మహాగ్రూప్స్ సీఎండీ మారేళ్ళ వంశీకృష్ణ మాట్లాడుతూ“పతిత పావనుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడటం మహాదౌర్భాగ్యాన్ని పోగొట్టి అపార పుణ్యాన్ని అందిస్తుంది. ఈ పవిత్ర సందర్భాన్ని అందరూ వినియోగించుకోవాలి” అని తెలిపారు.
భక్తులను ఆహ్వానిస్తూ…
“టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వామివారి కల్యాణాన్ని హైదరాబాదులో ఇటువంటి భారీ స్థాయిలో నిర్వహించడం మా భాగ్యం. నవంబర్ 26న సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి స్టేడియానికి ప్రతి భక్తుడు రావాలని, స్వామివారి కటాక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని అన్నారు.

