Revanth Reddy: భాగ్యనగరంలో మూసీ నది ఉద్ధృతి ప్రమాదకరస్థాయికి చేరుకోవడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, అవసరమైన అన్ని సహాయక చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.
మూసీ వరదపై ఉన్నతస్థాయి సమీక్ష
మూసీ పరీవాహక ప్రాంతాల్లోని వరద పరిస్థితులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు అవసరమైన చోట్ల పునరావాసం కల్పించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
శుక్రవారం అర్ధరాత్రి ఎంజీబీఎస్ బస్టాండ్ చుట్టూ నీరు చేరడంతో, అక్కడ ఇరుక్కుపోయిన ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి చేపట్టిన చర్యలను సీఎం సమీక్షించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు.
ఆర్టీసీకి కీలక సూచనలు
వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ దారుల (రూట్లకు)కు మళ్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ముఖ్యంగా బతుకమ్మ, దసరా పండుగల వేళ సొంత జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు, ఆర్టీసీ విభాగం తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ యంత్రాంగానికి అప్రమత్తత
ఇవాళ కూడా హైదరాబాద్‌లో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో, పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్తు వంటి అన్ని ప్రభుత్వ విభాగాలూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు నేరుగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
నగరంలో లోతట్టు ప్రాంతాలు, మూసీ నది ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాల్లో అధికారులు వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అటువైపు వాహనాలు మరియు ప్రజలు వెళ్లకుండా దారి మళ్లించాలని ఆయన పేర్కొన్నారు.
నగరంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.