CM Revanth Reddy: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అలర్ట్ చేశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
CM Revanth Reddy: గణేశ్ మండపాలకు సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి భక్తులకు ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా తగు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ సిబ్బందిని సీఎం ఆదేశించారు. నగరాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ ఉన్న నీటిని తొలగించాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యారోగ్య శాఖ సిబ్బంది సరిపడా మందులను అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని కోరారు.
CM Revanth Reddy: అతి భారీ వర్షాల ప్రభావానికి గురైన మెదక్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లను సీఎం రేవంత్‌రెడ్డి అలర్ట్ చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. వరద ముంపు ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎంతటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
CM Revanth Reddy: అదే విధంగా ఈ రోజు (ఆగస్టు 28న) సీఎం రేవంత్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేయనున్నట్టు సమాచారం. కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలను హెలికాప్టర్ ద్వారా ఆయన పరిశీలించనున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆయా ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

