CM REVANTH REDDY: మహిళలే దేశాన్ని గెలిపించిన శక్తిగా నిలిచారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటరులో నిర్వహించిన ‘వీ హబ్ – విమెన్ యాక్సిలరేషన్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, వారి అభివృద్ధి పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, మహిళా శక్తిని తక్కువగా అంచనా వేయకూడదని, వారి త్యాగాలు, సేవలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. 1962లో చైనా, 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాల్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వాన్ని ఉదాహరణగా చెప్పారు. ఆమె మహిళా శక్తిని ప్రపంచానికి చూపించారన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచీ మహిళల హక్కులను పరిరక్షిస్తూ, వారి ప్రగతికి కట్టుబడి పనిచేస్తోందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తోందన్నారు. “మా లక్ష్యం– కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం” అని రేవంత్ తెలిపారు.
అలానే, మహిళల కోసం ఉచిత ఆర్టీసీ ప్రయాణ సదుపాయాన్ని అందించిన సోనియాగాంధీని ఆయన ప్రశంసించారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల బాటలోకి వచ్చిందన్నారు. అమ్మ ఆధర్శ పాఠశాలల రూపంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మహిళలకు అప్పగించడం ద్వారా వారి శక్తిని సమాజ నిర్మాణంలో ఉపయోగిస్తున్నామని తెలిపారు.