TS News: తెలంగాణలోని అర్హులైన కోటి మంది మహిళలకు ‘ఇందిరా మహిళా శక్తి చీరల’ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం (నవంబర్ 19) లాంఛనంగా ప్రారంభించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, సీఎం ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లాలలోని మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ పథకం వెనుక ఉన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారు. తెలంగాణలోని ఆడబిడ్డలకు పుట్టింటి వాళ్లు, అన్నదమ్ములు సారె చీరె పెట్టడం సంప్రదాయం. అదే విధంగా, రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను తోబుట్టువుగా భావించి, మా ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి మహిళకు ఈ చీరను అందిస్తుంది.ఈ సందర్భంగా ఆయన మహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతి పేరిట చీరల పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
పంపిణీ షెడ్యూల్, సీఎం ఆదేశాలు
కోటి చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లోని 18 ఏళ్లు నిండిన మహిళలకు చీరల పంపిణీ పూర్తి చేయాలి. ఇందుకు 65 లక్షల చీరలు అందుబాటులో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు 35 లక్షల చీరలు పంపిణీ చేయాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, ప్రతి మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించి, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. కుల సర్వే (సీపెక్) డాటాను ఉపయోగించి, అర్హులైన ప్రతి మహిళకు చీర అందేలా చూడాలని, చీర అందించే సమయంలో ఆధార్‌తో ముఖ గుర్తింపు (Face Recognition) చేపట్టాలని సీఎం కలెక్టర్లకు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Rain Alert: హెచ్చరిక ఏపీలో వర్షాలు.. తెలంగాణపై చలి పంజా!
మహిళా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్
మహిళల ఉన్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని సీఎం తెలిపారు. ముఖ్యంగా, మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వివిధ వస్తువులను ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అమెజాన్‌తో సంప్రదింపులు చేస్తోందని వెల్లడించారు.
శిల్పారామం పక్కన వందల కోట్ల విలువైన 3 ఎకరాల స్థలంలో ‘ఇందిరా మహిళా శక్తి బజార్’ ఏర్పాటు చేస్తున్నామని సీఎం ప్రకటించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన వడ్డీలేని రుణాలను తాము విడుదల చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు, ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశామని తెలిపారు. యూనిఫాంలు కుట్టే బాధ్యత, ధాన్యం కొనుగోళ్ల బాధ్యత కూడా మహిళా సంఘాలకే అప్పగించడంతో వారికి రూ. 30 కోట్ల ఆదాయం సమకూరిందని వివరించారు.
మహిళా సంఘాల ఆనందం
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులు తమ అభిప్రాయాలను సీఎంకు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య మాట్లాడుతూ, తమకు ఇస్తున్న చీరల డిజైన్లు ఎంతో బాగున్నాయని, తమకు ఎంతో సంతోషంగా ఉందని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవి, ఈ చీరలు తమకు యూనిఫాం లాంటి సంతోషాన్ని ఇచ్చాయని, ఇవి ధరించడం ద్వారా తమ సంఘాల మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అన్నారు.నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతిని ఆమె సంఘం ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్ పనితీరు గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. బాగా నడుస్తోందని, నెలకు రూ. 4 లక్షల రాబడి వస్తోందని ఆమె సీఎంకు తెలియజేశారు. ఇతర జిల్లాల నుంచి సంఘాలను అక్కడకు తీసుకెళ్లి వారిని ప్రోత్సహించాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క కూడా మాట్లాడుతూ, మహిళల గౌరవం పెంచాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని, ఆకాశమే హద్దుగా మహిళలు ఎదగాలనే ఉద్దేశంతోనే ఆకాశం రంగును చీరలకు ఎంచుకున్నామని తెలిపారు.

