ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారన్న వార్త దేశం జీర్ణించుకోలేకపోతుంది. దేశ వ్యాప్తంగా ఆయన మరణానికి ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రతన్ టాటా మరణం పట్ల సంతాపం ప్రకటించారు
దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని, ఆయన మరణం పారిశ్రామిక రంగానికి తీరనిలోటు అని అని పేర్కొన్నారు. టాటా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎనలేని సేవలందించారని గుర్తు చేసుకున్నారు. టాటా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.రతన్ టాటా లేరన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్ ను సృష్టించారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంపదను సృష్టించడమే కాకుండా…ఆ సంపదను సమాజంలో అన్ని వర్గాలకు చేరేలా పద్మవిభూషన్ రతన్ టాటా ఎంతో కృషి చేశారని అన్నారు. రతన్ టాటా మృతి పారిశ్రామిక రంగానికే కాకుండా దేశానికే తీరనిలోటని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే స్పందిస్తూ.. టాటా చేస్తున్న పనుల ద్వారా అనేకమంది ప్రేరణ పొందారన్న ఆయన.. రతన్ టాటాను కోహినూర్ వజ్రంతో పోల్చారు. ఆయన మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు.

