CM Chandrababu: ప్రజలకు ఎరువుల కొరత లేదని భరోసా ఇస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎరువుల లభ్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో నేరాలను నమ్ముకున్న ఒక పార్టీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని రైతులు ఎరువుల లభ్యత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఎరువులు అందుబాటులో ఉన్నాయని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రస్తుతం 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, త్వరలో మరో 2.71 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గత పది రోజుల్లో 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ జరిగిందని, మరో పది రోజుల్లో 44,580 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని ఆయన వివరించారు. సరఫరాలో ఎలాంటి జాప్యం లేకుండా చూస్తామని, రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు. యూరియా పంపిణీలో పారదర్శకత కోసం ఆధార్ ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు.
Also Read: GST Council Meeting: నిర్మలాసీతారామన్ అధ్యక్షతన 56వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ
ఎరువుల లభ్యతపై సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది ఒక నేరపూరిత పార్టీ చేసే కుట్ర అని చంద్రబాబు ఆరోపించారు. కృష్ణా జిల్లాలో యూరియా లారీని అడ్డుకుని వివాదం సృష్టించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతే అని ఆరోపించారు. రైతుల ముసుగులో రాజకీయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా యూరియాను దారి మళ్లించిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేసి, రూ. 3 కోట్ల విలువైన యూరియాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే జైలుకు పంపుతామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ప్లాంట్ సమర్థతను పెంచడానికి కొన్ని సర్వీసులను మాత్రమే అవుట్‌సోర్సింగ్ చేస్తున్నారని, ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టం చేశారు. అంతేకాక, స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ. 12 వేల కోట్ల నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. గతంలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గులకరాయి, గుండెపోటు, కోడికత్తి వంటి డ్రామాలు చేసిందని, అలాంటి ఫేక్ రాజకీయాలు ఇకపై చెల్లవని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తారని, పది శాతం మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఆ హోదా వస్తుందని, ప్రభుత్వం కాదని ఆయన స్పష్టం చేశారు.