Cm Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ మార్కాపురంలో పర్యటించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం, టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.
మార్కాపురం జిల్లా కోసం ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఎప్పటి నుంచో పోరాడుతున్నారని, గత ప్రభుత్వం నంద్యాలను జిల్లాగా ప్రకటించినా, మార్కాపురంను ప్రకాశం జిల్లాలోనే ఉంచిందని ఆయన గుర్తుచేశారు. కానీ ఇప్పుడు మార్కాపురం కొత్త జిల్లా అవుతుందనే భరోసా చంద్రబాబు ఇచ్చారు.
కార్యకర్తలకు గౌరవం – టీడీపీ భరోసా
పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల వెన్నుతట్టి, త్వరలోనే పార్టీ పదవులు భర్తీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. కష్టపడి పని చేసిన వారికే అధిక ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీలోని నాయకుల పనితీరుపై తాను ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నానని తెలిపారు.
అన్ని ఎన్నికల్లో గెలిస్తేనే పార్టీ కార్యకర్తలకు గౌరవం పెరుగుతుందని, రాష్ట్రంలో సుస్థిర పాలన కోసం ప్రతి ఎన్నికలో విజయమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన సూచించారు.
l
టీడీపీకి నిజమైన కార్యకర్తలే బలం
“కార్యకర్తల శరీరంలో ప్రతి రక్తపు బొట్టూ పసుపు రంగేనని” చంద్రబాబు వ్యాఖ్యానించారు. నాయకులు మారొచ్చేమో, కానీ కార్యకర్తలు మాత్రం పార్టీని ఎప్పటికీ వదలరు అని స్పష్టం చేశారు. కార్యకర్తల కృషిని ఎప్పటికీ మరిచిపోనని, వారి సంక్షేమమే తన తొలి ప్రాధాన్యత అని చెప్పారు.
వైసీపీతో లాలూచీ – కఠిన చర్యలు తప్పవు
పార్టీ కార్యకర్తలతో ప్రత్యక్షంగా సమావేశాలు నిర్వహించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే చెప్పినప్పటికీ, చాలా మంది నిర్వహించడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ సమావేశాలు కంటే ప్రత్యక్షంగా కలవడం ముఖ్యం అని తెలిపారు.
క్షేత్రస్థాయిలో కొంతమంది టీడీపీ నేతలు వైసీపీ నాయకులతో లాలూచీ పడుతున్నట్టు తనకు సమాచారం అందిందని చంద్రబాబు చెప్పారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని, పార్టీకి నిబద్ధతగల నేతలే కొనసాగగలరని హెచ్చరించారు. “ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తలకు కాకుండా, మీకోసం మేము పని చేయాలా?” అంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
మార్కాపురం అభివృద్ధికి కొత్త పథకాలు
పరిపాలనా సౌలభ్యం కోసం మార్కాపురాన్ని కొత్త జిల్లాగా మార్చే దిశగా త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందని చంద్రబాబు తెలిపారు. కొత్త జిల్లా ఏర్పాటుతో ఇక్కడి అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మార్కాపురం జిల్లా ఏర్పాటు కోసం ప్రజలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పోరాడిన తీరును గుర్తిస్తూ, తమ ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎంచంద్రబాబు హామీ ఇచ్చారు.