CM chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 27న రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రాడ్యుయేట్లకు వివరించి, వారి మద్దతు పొందాలని సూచించారు. అదేవిధంగా, కూటమి నేతలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పేరాబత్తుల రాజశేఖర్, కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం చంద్రబాబు కోరారు. అదేవిధంగా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి రఘువర్మ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మంత్రులు, నేతలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు.