Cm chandrababu: హెల్తీగా ఉండాలంటే చక్కెర తక్కువ తినండి

Cm chandrababu: విశాఖపట్నంలో బుధవారం జరిగిన ‘స్వస్త్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ మా ధ్యేయం. ప్రజారోగ్యం, ముఖ్యంగా మహిళల ఆరోగ్యమే కుటుంబానికి బలమైన పునాది” అని స్పష్టం చేశారు.

మహిళల ఆరోగ్యమే బలమైన పునాది

చంద్రబాబు మాట్లాడుతూ, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యవంతమవుతుందని, అందువల్ల ఈ కార్యక్రమం ప్రతి ఇంటికీ ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 13,944 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ శిబిరాల్లో హైబీపీ, షుగర్, క్యాన్సర్లు, టీబీతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు ఉచిత పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

ప్రజారోగ్యానికి భరోసా

ఆరోగ్య రంగంలో రాష్ట్రం ఈ ఏడాది రూ.19,264 కోట్లు ఖర్చు చేస్తోందని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి కుటుంబానికి రూ.2.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందజేస్తున్నామని, తీవ్రమైన వ్యాధుల చికిత్సకు రూ.25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు ద్వారా ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. ‘ప్రాజెక్ట్ సంజీవని’ ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని వివరించారు.

మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం

స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళల ఆర్థిక సాధికారత కోసం డ్వాక్రా–మెప్మా సంఘాలు వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. డ్వాక్రా మహిళల పొదుపు రూ.20 వేల కోట్లు దాటిందని పేర్కొన్నారు. “లక్ష మంది మహిళలను లక్షాధికారులుగా చేయడమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీపై ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషమని చంద్రబాబు అన్నారు. “మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. 2047 నాటికి నంబర్ వన్ స్థాయికి చేరుకుంటుందనే విశ్వాసం ఉంది” అని తెలిపారు. నిర్మలా సీతారామన్ దేశానికి సమర్థవంతమైన సేవలు అందిస్తున్నారని కూడా కొనియాడారు.

విశాఖపై వరాలు

విశాఖ నగరాన్ని దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. “హుద్‌హుద్ తుఫాను సమయంలో విశాఖ వాసులు చూపిన సేవాభావం మరువలేనిది. గూగుల్ సంస్థ త్వరలోనే విశాఖ వస్తోంది. విశాఖ మహిళలకు అత్యంత సురక్షిత నగరం” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *