Cm chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జీఎస్టీ సంస్కరణలు (జీఎస్టీ 2.0) రాష్ట్ర ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకురానున్నాయని సోమవారం శాసనసభలో ప్రకటించారు. “సూపర్ సిక్స్ పథకాల మాదిరిగే ఈ ‘సూపర్ జీఎస్టీ’ కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వివరించడంతో, ఈ సంస్కరణల ద్వారా రాష్ట్రంలో రూ.8,000 కోట్ల వరకు ఆర్థిక ప్రయోజనం సాధ్యమవుతుందని, రాబోయే దసరా, దీపావళి పండుగలను ప్రజలు తగ్గిన ధరలతో ఆనందంగా జరుపుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
జీఎస్టీ 2.0 ఫలితాలను ప్రతి పౌరుడికీ చేరువ చేయడానికి మంత్రులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసినట్లు చంద్రబాబు తెలిపారు. పేద, మధ్యతరగతి వర్గాల జీవితాలను మార్చే శక్తి ఈ సంస్కరణలకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 99 శాతం నిత్యావసర వస్తువులపై పన్ను సున్నా శాతం కావడం వల్ల సామాన్యులపై భారం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు.
ఈ సంస్కరణల లాభాలు వినియోగదారులకే కాకుండా చిన్న వ్యాపారాలు, ఎంఎస్ఎంఈలు (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) కూడా పొందుతాయని చంద్రబాబు చెప్పారు. “మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ నినాదాలకు ఈ పథకాలు ఊతమిస్తాయి. భారతీయ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లతో పోటీ పడే మార్గం సుగమం అవుతుంది” అని ఆయన ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ భారతీయ ఉత్పత్తులను కొనుగోలు చేసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
దసరా నుంచి దీపావళి వరకు మెగా ప్రచారం
జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు దసరా నుంచి దీపావళి వరకు రాష్ట్రవ్యాప్తంగా మెగా ప్రచారం నిర్వహిస్తామని చంద్రబాబు వెల్లడించారు. 65,000కి పైగా సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్టోబరు 19 వరకు 26 జిల్లాల్లో ఈ ప్రచారం కొనసాగనుందని, గ్రామ, వార్డు సచివాలయాలు, 10,000 రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు చేరువవుతామని వివరించారు.
ప్రచారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు భాగస్వాములు అవుతారని, కళాశాలల్లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని కూడా పేర్కొన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, హోర్డింగులు, సోషల్ మీడియాలో సెల్ఫీ కాంటెస్టులు, శాండ్ ఆర్ట్ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. జీఎస్టీ తగ్గిన తర్వాత ఉత్పత్తుల కొత్త ధరలను దుకాణాల్లో ప్రదర్శించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి చివరగా, ఈ సంస్కరణలు భవిష్యత్ తరాల ఉజ్వల భవిష్యత్తుకు, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి దోహదపడతాయని, ప్రజలకు దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.