Cm chandrababu: ఉత్తరాంధ్ర జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలు ప్రజలను అతలాకుతలం చేశాయి. వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సీఎం తక్షణమే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, పరిస్థితులను అంచనా వేశారు. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయంగా రూ. 4 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
విశాఖపట్నం నగరంలోని కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో మరొకరు వర్షాల కారణంగా మృతి చెందినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఎగువ ఒడిశాలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో నదుల్లో వరదలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
👉 వంశధార నదిలోకి 1.05 లక్షల క్యూసెక్కుల వరద నీరు,
👉 గొట్టా బ్యారేజీకి 1.89 లక్షల క్యూసెక్కులు,
👉 తోటపల్లి బ్యారేజీకి 44 వేల క్యూసెక్కుల నీరు చేరుతోందని శ్రీకాకుళం కలెక్టర్ వివరించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రహదారులపై విరిగిపడిన చెట్లలో 90 శాతం వరకు తొలగించగా, 90 శాతం విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని అధికారులు సీఎంకి నివేదించారు.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సహాయక చర్యల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని ముఖ్యమంత్రి అధికారులను గట్టిగా హెచ్చరించారు.